Sunday, April 28, 2024

End of YSRTP – రాజకీయ వనంలో ఏకాకి….క్రిజ్ లోకి దిగకుండానే షర్మిల డకౌట్

రాజకీయాల్లో హత్యలు ఉండవ్. ఆత్మహత్యలే. రాజకీయ కౌశల్యుడు వైఎస్సార్‌ తనయ.. యేడుగురి సందింటి షర్మిలరెడ్డి.. రాజకీయ వనంలో ఏకాకిగా మిగిలిపోయారా? ఏమో! చిన్నప్పటి నుంచి తన తల్లిపాలు పంచుకున్న చెల్లి స్థితి, గతి అన్నకే తెలుసు. అహంభావం, ఆత్మాభిమానం, అనాలోచన, అన్నిటికీ మించిన క్షణికావేశం.. సహా తన చెల్లెమ్మ అంతర్గత గుణాలన్నీ అన్న జగనన్నకే ఎరుక. అందుకే రాజకీయాలకు దూరంగా పెట్టారేమో? కానీ, కుట్రలు, కుతంత్రాల ఫలితాలను రుచి చూడాలని షర్మిలను రాజకీయ బలవన్మరణానికి తరిమిన పన్నాగం ఎవరిది? తిరుగులేని, ఎదురులేని బాణాన్ని విరిచిందెవరు? దూసుకెళ్లే రేసు గుర్రం డీలా పడి.. వికల అశ్వినీగా మారటానికి కారకులెవరు? షర్మిలరెడ్డి స్వయం కృతమా? కాంగ్రెస్ కోటరీ విష ప్రయోగమా? నిజాల ఆలోచనలకు ఈ కథాంశాన్ని చదివేద్దాం,.
= ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్‌

రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా.. తెలంగాణ గడ్డపై తొందరపడిన ఈ కోయిల.. శంఖం పూరించి.. కదన రంగంలో అడుగుపెట్టకుండానే యుద్ధ భూమి నుంచి వైదొలిగి ఏకాకిగా మిగిలిందంటే అతిశయోక్తి కానే కాదు. రాయలసీమ ఆడబిడ్డగా పౌరుష వనితగా.. నాటు బాంబులా.. పిడికత్తిలా , గండ్ర గొడ్డలిని గుర్తుకు తీసుకురావటమే కాదు.. ఆప్యాయత, అనురాగం, ఆలంబనకు ప్రతీకగా కనిపించిన‌ షర్మిలమ్మలో, అహంభావం, ఆత్మాభిమానం మరో కోణం,. అందుకే అన్న కోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అన్న రాజకీయ భవితవ్యం కోసం అహర్నిశం తపించారు. కడకు అన్ననే కాదని తన మెట్టినింటికి చేరి తనకు తానే రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. కానీ, తానే అధినేత్రి, తానే సర్వస్వం. తానే ప్రజ. అనే రీతిలో రాజకీయ బాటలో నడిచి.. నడిచి,, అలసట తీరక వెనుదిరిగి.. ఏకాకిలా మిగిలిపోయారు!

రాజకీయ పునాది..
రాయలసీమలో ఆరితేరిన ఫ్యాక్షనిస్టు రాజిరెడ్డి మనుమరాలు.. దివంగ‌త వైఎస్సార్‌ తనయ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెమ్మ.. షర్మిలమ్మ తిరుగులేని వీర వనిత‌. మంచి చదువరి. లౌక్యశీలి. అక్కున చేర్చుకునే ఆదరాభిమాని. ఇది బయటి కోణం. అనుకున్నది అనుకున్నట్టు జరగాలేద‌నో.. లేదో.. కోపం, తీరని వైరం. నచ్చనోళ్ల ముఖం చూడని నైజం. షర్మిలమ్మ ప్రతిబింభం. అన్న జగనన్న అంటే అమిత ప్రేమ. లక్షల కోట్ల అక్రమార్జన కేసులో చర్లపల్లి జైలు జీవితం గడుపుతున్న అన్నకు ప్రజాసానుభూతిని అర్జించేందుకు 2012 అక్టోబర్ 18న తన కాళ్లకు బూటు తొడిగింది. తండ్రి వైస్సార్‌ సమాధి నుంచి తన పాదయాత్రకు శంఖం పూరించి.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకూ అంటే 14 జిల్లాల్లో 3000 కిలోమీటర్లు నడిచి రికార్డు సృష్టించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా.. రాయలసీమ రక్తంతో.. ఇంత దూరం నడిచిందంటే, జగనన్న ఆడబిడ్డ కాదు. వీర సోదరి అని జనం కీర్తించారు.

అన్నకు దూరం ఎలా అయ్యారంటే..
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలు జీవిత కాలంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కన్వీన‌ర్‌గా షర్మిలమ్మ భుజానికి ఎత్తుకుంది. అన్న బయటకు వచ్చిన త‌ర్వాత‌ 2019ఎన్నికల్లో ప్రచార సారథిగా మళ్లీ జనంలోకి ప్రత్యక్షమైంది. ప్రజాతీర్పుతో బాబు బై బై నినాదంతో 11 రోజులు 1553 కిలోమీటర్లు బస్సు యాత్రలో పాల్గొని 39 సభల్లో ప్రసంగించి.. అన్న విజయానికి బాట వేశారు. తరువాత ష‌ర్మిల‌ రాజకీయ భవితవ్యంపై ఎన్ని ఊహగానాలు కథలు కథలుగా వినిపించినా.. అన్న జగనన్న ఆలోచనలో మార్పులేదు. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించారు. పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో తల్లి విజయమ్మకు టిక్కెట్టు పార్టీ అధ్యక్షురాలిగా ప్రకటించారు. విశాఖపట్నం ఎంపీ స్థానంలో విజయమ్మ ఓడపోగానే.. జగనన్న తన వ్యూహాన్ని తిరగరాశారు. అమ్మ చేతిలో పగ్గాలు మర్యాదగా తొలగించారు. ఇక్కడే అన్న, చెల్లెలికి మధ్య భూకంపం వచ్చింద‌నే ప్ర‌చారం జ‌రిగింది. అది కాస్త‌ అగాధంగా మారింది.

ఆక్రోశం.. ఆగ్రహం..
అన్నయ్య భవిష్యత్తు కోసం తన ప్రయాస, శ్రమకు గుర్తింపు ఇవ్వక పోవటమే కాదు.. తల్లిని రాజకీయంగా దూరం చేశాడనే అక్కసు, ఆక్రోశంతో జగన్మోహన్రెడ్డికి షర్మిల దూరమైంది. హైదరాబాద్‌లోని మెట్టినింటికి సర్దుకుని వచ్చేశారు. వైసీపీతో తెగతెంపులు చేసుకున్నారు. తల్లి విజయమ్మనూ తనతో తీసుకువచ్చేశారు. తానూ రాజశేఖర్ రెడ్డి బిడ్డనే. తనకూ ఆత్మాభిమానం తక్కువేమీ కాదు. రాజకీయ చతురతలోనూ ధీశాలే. తాను మాత్రం సొంతగా రాజకీయ పార్టీని ఎందుకు స్థాపించకూడదు. తాను సైతం ఇందిరా గాంధీలా, మమతా బెనర్జీలా? సోనియా గాంధీలా? ఎదగలేనా? ఇత్యాధి ప్రశ్నలతో… అంతర్మథనంలో ఓ కీలక నిర్ణయానికి షర్మిలా వచ్చారు. అన్నకు దీటుగా రాజకీయ శక్తిగా ఎదగాలనే తలంపుతో తెలంగాణ గడ్డపై పాగా వేశారు.

- Advertisement -

వైఎస్ఆర్ తెలంగాణ చీఫ్‌గా.. హల్చల్
దివంగత ఏపీ సీఎం వైఎస్సార్‌కు ఆంధ్రాలోనూ, తెలంగాణాలోనూ అభిమానులెక్కువే. ఆయన తనయగా రాజకీయ వేదిక మీదకు వస్తే.. తన వాగ్బాణాలతో అలరించి, మురిపించి, మైమరపించి జనాన్ని ఆకట్టకోవచ్చనే యోచనతో.. తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని స్థాపిస్తున్నట్టు 2021 ఏప్రిల్ 9న హైదరాబాద్‌లో షర్మిలా రెడ్డి ప్రకటించారు. నిజంగానే తెలంగాణాలో టీఆర్ఎస్ జమానాలో రాజకీయ సౌఖ్యం దొరకక.. తమలో తామే అల్లాడిపోతున్న కేసీఆర్ వ్యతిరేక వర్గం షర్మిలరెడ్డి ప్రకటనతో గంతులేశారు. దావత్‌లు జ‌రుపుకున్నారు. జనంలో, నాయకుల్లో ఊపును గమనించిన షర్మిల రెడ్డి.. జులై 9న తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని స్థాపించారు.

ప్రచార యజ్ఞంలో…
పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలా రెడ్డి తన ప్రస్థానాన్ని తెలంగాణ ఉద్య‌మ నేత‌, సీఎం కేసీఆర్‌పై ఎదురుదాడిగా ప్రారంభించారు. కేసీఆర్‌పై నిత్యారోపణలతో చెలరేగిపోయారు. కేసీఆర్ సర్కారు అంతమే తన ధ్యేయంగా అడుగులు ముందుకు వేశారు. తెలంగాణలోనూ పాదయాత్రకు కొంగుబిగించారు. సహజంగా సర్కారు బ్రేకులు షరా మామూలే. కానీ, షర్మిలా రెడ్డి ఎక్కడా తగ్గలే. పోలీసు చర్యల్ని తప్పి కొట్టారు. ఒక ద‌శ‌లో పోలీసులపై చెయ్యి కూడా చేసుకున్నారు. కేసీఆర్‌ను ఎదురించగల ధీర వనితంటే షర్మిలమ్మే అనే ప్రచారం కోసం.. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారింది మొదలు వైసీపీ నేతల కీర్తనలతో ఆనంద పరవశం చెందే షర్మిలమ్మకు ఆలస్యంగా జ్ఞానోదయం అయ్యింది. వైసీపీ దండనాయుకులే తన వెంట ఉన్నారని, జనం కనీసం చూడటం లేదని గ్రహించారు. ఇంతలోనే తెలంగాణలో ఎన్నికల దండోరా మోగింది. ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల్లో సతమతమవుతుంటే.. షర్మిలమ్మ రాజన్న రాజ్య స్థాపన మర్చిపోయారు.

రాజన్న రాజ్యానికి సమాధి..
తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనకు కొంగు నడుముకు చుట్టిన ధీరోదాత్త షర్మిల రెడ్డి.. పొద్దున్నే అమ్మనాన్నకు గుడిసె వేసి, అమ్మకు పట్టుచీర ఇద్దాం అని తెల్లారిన తరువాత మర్చిపోయే బిడ్డలా.. తన అసలు లక్ష్యాన్ని మర్చిపోయారు. తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ మనుగడ ఊసును పక్కన పెట్టేశారు. కాంగ్రెస్ శిబిరం నుంచి పిలుపు రాగానే… తానే తెలంగాణకు కాబోయే తొలి మహిళా సీఎం అనే ఆశతో గంతులేస్తూ ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ తనను పక్కన కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి చిలక పలుకులు వింటున్న సోనియమ్మ కథాకమామిషుతో చిర్రెత్తింది. కనీసం పాలేరు నుంచి గెలిస్తే.. ఎమ్మెల్యేలను కొనుక్కుని సీఎం అవుదామంటే.. ఇవ్వనమ్మ వాయనం, తీసుకోనమ్మ వాయనం అనే రీతిలో షర్మిలమ్మకు పాలేరు టిక్కెట్టు లేదని కాంగ్రెస్ శిబిరం చావు కబురు చల్లగా చెప్పింది.

మళ్లీ పౌరుషం.. అంతలోనే నీరసం..
కాంగ్రెస్ ఢోకాతో దిమ్మ తిరిగిన షర్మిలకు అకస్మాత్తుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గుర్తుకు వచ్చింది. 119 సీట్లకు జాబితా రెడీ అని ప్రకటించింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దండనాయకుల్లో మళ్లీ ఉత్సాహం, ఉల్లాసం. పోటీ చేసి గెలవకపోయినా అదో ర‌కం సంబురాల్లో మునిగిపోయారు. ఇంతలో ఏం జరిగిందో… లోటస్ పాండ్‌లో ప్రెస్‌మీట్ కు షర్మిలమ్మ కార్యాలయం విలేక‌రులను పిలవగా.. ఈ రోజు టిక్కెట్ల జాబితా ప్రకటిస్తారని వెళ్లిన వారికి ఒకింత షాక్ ఎదుర‌య్యింది.. వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తాను పోటీ చేస్తే కాంగ్రెస్ ఓడిపోతుందని, కేసీఆర్ అంతమే తన లక్ష్యమని ప్రకటించటంతో.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేత‌ల‌ దిమ్మ తిరిగింది.

ఇలా ఏకాకిగా…
బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కోసం రాజన్న‌ రాజ్యాన్ని బొందలో పెట్టిన షర్మిలమ్మ.. ప్రస్తుతం ఏకాకిలా మిగిలి పోయారు. తన మాట విని కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తారనుకున్న వైఎస్ఆర్ తెలంగాణ ప్రియులందరూ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గట్టు రామచంద్రరావు లాంటి వైఎస్ఆర్ అభిమాని కూడా బీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇక ఇది సరే… ఆంధ్రాలోనూ వ్యతిరేకమే. తెలంగాణ నుంచి తమను తరిమేసిన కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు ప్రకటించటాన్ని సహించలేక పోతున్నారు. ఇక తన అన్నకు అంత్యంత సన్నిహితుడు సజ్జల రామకృష్ణారెడ్డినీ షర్మిల రెడ్డి తీవ్ర పదజాలంతో విమర్శించటంతో.. ఆంధ్రాలో వైసీపీ కన్నెర్ర చేస్తోంది. ఆమె సజ్జలను విమర్శించలేదని, జగనన్నను అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏతావాతా.. ఆధిపత్యం కోసం, స్వల్ప వ్యవధిలో అధికారం కోసం షర్మిలమ్మ రచించిన వ్యూహాలు ప్రతివ్యూహాలుగా మారిపోయాయంటే.. ఆశ్చర్యపోనక్కరేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement