Thursday, April 25, 2024

టీఆర్ఎస్ కు ఈటల రాజీనామా?.. రెండు రోజుల్లో నిర్ణయం!

తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేయడం పెను సంచలనంగా మారింది. ఈటల రాజేందర్‌ పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెదక్‌ జిల్లా కలెక్టర్‌ నివేదిక పంపిన నేపథ్యంలో.. ఆయన్ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించారు. ముఖ్యమంత్రి సిఫారసు మేరకు ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంటూ గవర్నర్‌ కార్యాలయం ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేసింది.  భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటల నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలను శనివారం ముఖ్యమంత్రికి బదలాయించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం సాయంత్రం భూ కబ్జా ఆరోపణలపై ప్రభుత్వానికి నివేదిక అందింది. ఈ నేపథ్యంలో ఈటలపై వేటు పడింది. అయితే, బర్తరఫ్‌ తో సరిపెట్టకుండా వివిధ చట్టాల ఉల్లంఘనను కారణంగా చూపుతూ ఆయనపై మరిన్ని చర్యలకు కూడా ప్రభుత్వం ఆదేశించే అవకాశమున్నట్లు సమాచారం.  భవిష్యత్తులో పార్టీ నుంచి కూడా బహిష్కరణ తప్పదా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి వరుసగా రెండో రోజు ఆదివారం కూడా పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి తరలివచ్చారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు కుల సంఘాల నేతలు కూడా వచ్చి తమ సంఘీభావం తెలియజేశారు. ‘మేము మీ వెన్నంటి ఉంటాం’అని నియోజకవర్గంలోని కేడర్‌ స్పష్టం చే సినట్లు సమాచారం. వివిధ సంఘాల నేతలు మా త్రం ఏదో ఒక రాజకీయ నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి కూ డా రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాలని కొందరు, పార్టీలో కొనసాగుతూ తాడో పేడో తేల్చుకోవాలని మరికొందరు సూచించినట్లు తెలుస్తోంది. తనను కలుస్తున్న వారందరికీ.. ‘వేచి చూద్దాం.. తొందర పడొద్దు’అంటూ ఈటల సమాధానం ఇస్తున్నారు. అందరమూ కూర్చొని మాట్లాడుకుందామని చెబుతున్నారు. ఒకటి రెండురోజుల్లో నియోజకవర్గ కేంద్రానికి వెళ్లేందుకు ఈటల సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. కార్యకర్తలతో సమావేశమై వారి నుంచి అభిప్రాయ సేకరణ జరపాలనే యోచనలో ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, శ్రేయోభిలాషులతోనూ భేటీ అయ్యే అవకాశముంది. అనంతరం కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తన ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కంటే ఏ పదవీ పెద్దవి కావని వ్యాఖ్యానించిన ఈటల రాజేందర్ తాజా పరిణామాలతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే రాజీనామా చేయనున్నారా? ఆయన భవిష్యత్తు ప్లాన్ ఏమిటి? అనేది ఉత్కంఠగా మారింది. ఈటల ఇతర పార్టీల్లో చేరుతారా? లేక స్వంతంగా పార్టీ పెట్టుకుంటారా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ నేతగా, మంత్రిగా ఇన్నాళ్లూ పార్టీలో కీలక స్థానంలో ఉన్న ఈటల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై టీఆర్‌ఎస్‌లో మౌనం రాజ్యమేలుతోంది. ఎవరూ దీనిపై మాట్లాడటం లేదు.  వెనకబడిన కులాల ప్రతినిధిగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్‌ కు సొంత పార్టీ నుంచి ఒక్క బీసీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా ఆయనకు అండగా నిలవలేదు. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు మినహా పార్టీ ఇతర నేతలెవరూ ఈటల ఇంటి దరిదాపులకు వెళ్లకపోవడం గమనార్హం. దీంతో ఆయన పార్టీలో ఒంటరి అయిపోయారు.

మొదటి నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమంలో, టీఆర్‌ఎస్‌ పార్టీలో ఈటల కీలకంగా వ్యవహరించారు. అకస్మాత్తుగా టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఈటలపై చర్యలు తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నుంచి సానుభూతి లభిస్తోంది. ఈ నేపథ్యంలో తనతో కలిసొచ్చే వారితో త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఈటల నిమగ్నమైనట్లు సమాచారం. ప్రధానంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలు టీఆర్‌ఎస్‌ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. వీరిలో కొందరు ఆయన్ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. దళిత, బహుజనుల కోసం పార్టీ స్థాపించాలని ఈటల రాజేందర్‌ను ఓయూ దళిత బహుజన విద్యార్థులు కోరారు. ఈటల మాత్రం అచితూచి అడుగులు వేస్తున్నారు. తన వెంట కలిసొచ్చే నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన ఏ మేరకు మద్దతు లభిస్తుంది ? ప్రజలు ఎలాంటి ఆదరణ చూపుతారు అనేది కూడా చర్చనీయాంశంగానే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement