Tuesday, May 7, 2024

పేదోడి ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు! రాష్ట్ర వ్యాప్తంగా 2,91,057 ఇళ్ల నిర్మాణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సామాన్య ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు నిలుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు పేదోడి కలను సాకారం చేస్తున్నాయి. సొంత ఇళ్ళు అనేది ప్రతి ఒక్కరికీ ఓ అందమైన కల, ఆ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించింది. ఇళ్ళు లేని నిరుపేదల మీద ఒక్క పైసా కూడా భారం మోపకుండా ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. ఓ చిన్న గూడు ఉంటే చాలు అనుకునే నిరుపేద కుటుంబాలకు కొత్త వెలుగులు పంచుతూ 560 చదరపు అడుగుల వైశాల్యంలో విశాలమైన రెండు పడక గదులు, ఒక వంట గది, ఒక హాల్‌తో పాటు రెండు బాత్‌ రూంలతో కూడిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళని ప్రభుత్వం ఉత్తమ ప్రమాణాలతో నిర్మిస్తున్నది. రాష్ట్రంలో తొలివిడతగా 19 వేల 329 కోట్ల రూపాయల వయ్యంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధితో సహా 2 లక్షల 91 వేల 57 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ కృషిని పలువురు జాతీయ నాయకులు సైతం పార్లమెంటు సాక్షిగా పొగుడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

రూ.10,806 కోట్లు ఖర్చు…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల గృహ నిర్మాణ పథకంలో ఇప్పటి వరకు 2,91,057 గృహాలను మంజూరీ చేయడం జరిగింది. మంజూరు చేసిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు నిర్మాణాలను చాలా వరకు పూర్తి చేశారు. కొన్ని చోట్ల లబ్దిదారులకు అందజేయడం కూడా పూర్తి అయ్యింది. వీటిపై ఇప్పటివరకు రూ.10,806.728 కోట్ల నిదులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. బిల్లుల విడుదలలో పారదర్శకత, జవాబుదారితనం ఉండేలా కాంట్రాక్టర్లు బిల్లులు సమర్పించిన 15 పని దినాలలో జిల్లా కలెక్టర్ల ద్వారా బిల్లులు విడుదల చేయడం జరుగుతుంది. బిల్లులు చెల్లింపులో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ సిస్టంను (ఓపీఎంఎస్‌) ప్రవేశపెట్టడం జరిగింది.

ఓపీఎంఎస్‌ ద్వారా కాంట్రాక్టర్లకు రావలిసిన బిల్లు వివరాలు ఆన్‌లైన్‌లో వారికి కేటాయించిన లాగిన్‌ పొందుపర్చిన వెంటనే సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఆదేశాలు జారీ అవుతాయి. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ద్వారా పంపబడిన బిల్లులను జిల్లా నోడల్‌ అధికారి పరిశీలించిన వెంటనే జిల్లా కలెక్టర్‌ ద్వారా కాంట్రాక్టర్ల బ్యాంక్‌ అకౌంట్‌లో నేరుగా నగదు జమ చేయబడుతోంది. ఈ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి అవుతోంది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ డిజైన్‌, లేఔట్లలో, సృజనాత్మకత మరియు ఇండ్ల నిర్మాణంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు, పారదర్శకత పాటిస్తున్నందుకు ‘ఓపీఎంఎస్‌కు జాతీయ స్థాయిలో ఇటీవల హడ్కో అవార్డులు కూడా ప్రభుత్వం దక్కించుకోవడం జరిగింది. ఈ పథకం అమలును అధ్యయనం చేయటానికి రాష్ట్రాన్ని సందర్శించిన జాతీయస్థాయి, ఇతర రాష్ట్రాల అధికారులు, నిపుణులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అధికారులు అధ్యయనం నిమిత్తం రాష్ట్రంలో పర్యటించి ఉన్నత ప్రమాణాలతో నూతన సాంకేతిక పరిజ్ఞానముతో నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించి వారి రాష్ట్రాలలో కూడా ఈ పథకం అమలుకు చర్యలు చేపడతామని చెప్పడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement