Thursday, May 2, 2024

ధాన్యం కొనడం లేదని.. రైతు బలవన్మ‌ర‌ణం

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : ఆరుగాలం అలుపెరుగకుండా శ్రమటోర్చాడు. పంట చేతికొచ్చింది. అమ్ము కోవడానికి చేసే ప్రయత్నంలో సరుకు కొనే కొనుగోలుదారుల్లేక ఆరైతుకు జీవితంపై విరక్తి కలిగింది. ఇక బ్రతికి ఉండటం వ్యర్థమని బలవన్మ‌ర‌ణం పొందాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి… ధాన్యం కొనే దిక్కు కనిపించకపోవడంతో ఓ రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివపురం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన దేవంపల్లి కుమార స్వామి (52)కి ఉన్న ఏడెకరాల్లో వరి సాగు చేశాడు. ఇందులో రెండెకరాల సొంత భూమి కాగా, మిగతా ఐదెకరాలు కౌలుకు తీసుకున్నాడు. అయితే గత రెండేళ్లుగా నష్టాలు పలకరించాయి.

పంట దిగబడి లేక, పెట్టుబడికి వచ్చే రాబడికి పొంతన లేకపోవడంతో అప్పుల పాలయ్యాడు. ఈ సారి పంటపై ఆశలు పెట్టుకున్నా చేదు అనుభవమే ఎదురైంది. పంట దిగుబడి దారుణంగా పడిపోవడంతో పాటు ధాన్యం కొనే దిక్కు కనిపించడం లేదని మనస్తాపం చెందాడు. వరి ధాన్యం కుప్ప వద్దకు వెళ్లిన కుమారస్వామి తన వెంట తీసుకెళ్లిన పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటికి విషయం గమనించిన కుటుంబ సభ్యులు ములుగు ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో కుమారస్వామి కన్నుమూశాడు. ఆయ‌న‌ మృతితో గ్రామ రైతులంతా కన్నీరు మున్నీరవుతున్నారు. ఎవుసం ఎందుకు చేయాలంటూ ఆవేదన చెందుతున్నారు. ఆ కుటుంబం ఇప్పుడు బజారున పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement