Monday, May 6, 2024

అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ తోనే … మంత్రి త‌ల‌సాని

అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా…. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా అది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని బీఆర్ఎస్ తోనే సాధ్యమ‌వుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం కంటోన్ మెంట్ నియోజకవర్గ పరిధిలో గల బోయిన్ పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్ లో జరిగిన మొదటి వార్డు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా దివంగత ఎమ్మెల్యే సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ జిల్లా ఇంచార్జి శ్రవణ్, నియోజకవర్గ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, బెవరేజేస్ కార్పోరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ లతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కంటోన్ మెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల సమస్యలు అనేకంగా పరిష్కరించినట్లు తెలిపారు. కళ్యాణలక్ష్మి క్రింద ఒక లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం, వృద్దులు, వికలాంగులకు ప్రతి నెలా ఆసరా పెన్షన్ క్రింద ఆర్థిక‌ సహాయం అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా గతంలో కంటోన్ మెంట్ ప్రాంత ప్రజలకు 15 రోజులకో సారి త్రాగునీరు సరఫరా జరిగేదని, త్రాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడేవారని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతో జీహెచ్ఎంసీ లో మాదిరిగానే కంటోన్ మెంట్ లో కూడా ప్రతిరోజు త్రాగునీరు సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సాయన్న కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందించినట్లు చెప్పారు. కంటోన్ మెంట్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలను అందించే ఆలోచనతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా రూ.1200 కోట్ల వ్యయంతో మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని చెప్పారు.

కంటోన్ మెంట్ గులాబీ జెండా అడ్డ అని…రానున్న బోర్డు, ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులను అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక లక్ష 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని, మరో 95వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి ఇప్పటివరకు ఎన్ని భర్తీ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల వలన ప్రజలకు ఏం మేలు జరగదని స్పష్టం చేశారు. ఈనెల 25వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశానికి అన్ని వార్డులకు చెందిన ముఖ్య నాయకులు, మాజీ బోర్డు సభ్యులు, ఉద్యమ కారులను ఆహ్వానించాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement