Wednesday, May 15, 2024

బీజేపీ దీక్షకు అనుమతి నిరాకరణ.. మండిపడ్డ సంజయ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇందిరాపార్క్‌ వద్ద గురువారం బీజేపీ చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం, కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకపోవడంతో బీజేపీ ఎమ్మెల్యేలు దీక్షకు సిద్దమైన విషయం తెలిసిందే. అయితే ఈ దీక్షకు అనుమతి లేదని పోలీసులు బుధవారం పార్టీ కార్యాలయానికి సమాచారం అందించారు. పోలీసుల నిర్ణయంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌తో పాటు కాంగ్రెస్‌ తదితర పార్టీలు ఎన్నో సమస్యలపై దీక్షలు చేశారని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు, ఆందోళనలు చేసే వేదిక ధర్నాచౌక్‌ అనీ, ట్రాఫిక్‌ జాం, ప్రజలకు ఇబ్బంది అంటూ కుంటి సాకులతో అనుమతించడం లేదని చెప్పడం విస్మయం కలిగిస్తుందన్నారు. ఇందిరాపార్క్‌ను ధర్మాచౌక్‌గా పునరుద్దరించిన తర్వాత సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు దీక్ష చేశారని, అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకు వస్తుందని నిలదీశారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే కుట్ర అని అన్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, అడ్డంకులను సృష్టించినా దీక్ష చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement