Saturday, May 4, 2024

Dead Storage – అడుగంటిన ఆశ‌లు! ఎండిపోతున్న‌ ప్రాజెక్ట్ లు

డెడ్ స్టోరేజీకి చేరిన శ్రీ‌శైలం జ‌లాశ‌యం
కృష్ణా పరివాహక ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి
శ్రీశైలం ప్రాజెక్టుపై సన్నగిల్లిన ఆశలు
అడుగటంటుతున్న 26, 160 చెరువులు
యాసంగిలో వేసిన 7.50 లక్షల ఎరాల పంటలు ప్రశ్నార్థకం
భూగర్భంలోకి తరలుతున్న జలాలు
నీటి గోస త‌ప్ప‌దంటున్న ప‌రిశీల‌కులు
తాగునీటికి ఆల్మ‌ట్టిపై ఆధార‌ప‌డాల్సిందేనా
క‌ర్నాట‌క నుంచి 15 టీఎంసీల కోసం య‌త్నాలు
అప్పుడ‌తే తాండవిస్తున్న కరువు పరిస్థితులు
సమస్యగా మారనున్న పశువుల దాణా

ఓ వైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు జలాశయాల్లో అడుగంటిన నీటినిల్వలు.. దీంతో దక్షిణ తెలంగాణ రైతులు నెర్రలుబారిన పొలాలను చూస్తూ కన్నీరు పెడుతున్నారు. ప్రధానంగా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత ద‌య‌నీయంగా మారింది. పూర్వ మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మూడు జిల్లాల్లోని చెరువులు, కుంటలు, జలాశయాలు క్రమేణ అడుగంటి పోవడంతో యాసంగిలో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వేసిన సుమారు 7 లక్షల 50 వేల ఎకరాల్లో వరితో పాటు వేసిన జొన్న, మొక్కజొన్న పంటలు ప్రశ్నార్థకమవయ్యాయి. సుమారు 20 లక్షల ఎకరాల్లో వేయాల్సిన పంటలు యాసంగిలో కేవలం 7లక్షల 50 వేల ఎకరాల్లో వేసినా ఆ పంటలకు నీరు అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని సుమారు 23వేల 160 చెరువులు కుంటలు ఎండిపోవడంతో భూగర్భజలాలు అందనంత లోతుగా వెళ్లుతున్నాయి. దక్షిణ తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రధానంగా 26వేల 160 ట్యాంకుల ద్వారా122 టీఎంసీ నీరు అందుబాటులో ఉంటుంది. ఈ నీటితో 11 లక్షల ఎకరాలకు రబీలోసాగునీరు అందే అవకాశం ఉంది. అయితే యాసంగిలో వేసిన పంటల్లో ఈ చెరువుల కిందనే సుమారు 4 లక్షల ఎకరాలు ఉన్నట్లుఅధికారులు అంచెనా వేశారు. చెరువుల్లో నీరు అడుగంటడంతో భూగర్భంలోకి నీరు ఇంకి బోరుబావుల పరిస్థితి ఆందోళన కరంగా మారింది.

జూరాల‌, క‌ల్వ‌కుర్తిలో నీళ్లు లేవు..

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్‌క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, జోగుళాంబ గ‌ద్వాల‌, రంగారెడ్డి, న‌ల్గొండ జిల్లాల‌కు నీటి వ‌న‌రులుగా ఉన్నా ప్రాజెక్టులు అడుగంటాయి. ప్రధానమైన జూరాల, కల్వకుర్తి జలాశయాలు కూడా అడిగంటి పోయాయి. మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సామర్థ్యం ఉన్న కల్వకుర్తి ప్రస్తుతం తాగునీటి అవసరాలను తీర్చడమే ప్రశ్నార్థకంగా మారింది. శ్రీశైలం పరిస్థతి అత్యంత దయనీయంగా మారింది. డెడ్‌ స్టోరేజీ మినహా కేవలం 13 టీఎంసీలు మాత్రమే ఈ జలాశయంలో నీరు అందుబాటులో ఉందని అధికారులు అంచనావేశారు.

డెడ్ స్టోరేజీకి స‌మీపంలో శ్రీ‌శైలం ప్రాజెక్టు..

- Advertisement -

29 టీఎంసీల డెడ్‌ స్టోరేజీకి మరికొద్ది రోజుల్లోనే శ్రీ‌శైలం చేరుకోనుందని సాగునీటి పారుదల అధికారులుఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీ నీటిని తోడుకోవడం కొనసాగిస్తుండటంతోయాసంగిలో శ్రీశైలంపై ఆధారపడి న వ్యవసాయ క్షేత్రాలకు నీరు ప్రశ్నార్థకమైంది. శ్రీశైలం నుంచి నీటి ప్రవాహం లేకపోవడంతో క్రమేణ నాగార్జున సాగర్‌ జలాలు అడుగంటుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం నార్లాపూర్‌ జలాశయంలో కోతి గుండు నుంచి కృష్ణా బ్యాక్‌ వాటర్‌ 2టీఎంసీలు నింపినప్పటికీ ఆనీటిని వ్యవసాయ క్షేత్రాలకు అందించేందుకు నీటిపారుదల శాఖ అభ్యంతరం తెలుపుతోంది.

ఎండాకాలంలో తాగునీటికి క‌ష్ట‌మే..

ప్రధానంగా రాబోయో వేసవి నాటికి నీటి ఎద్దడి తీవ్ర కానుండటంతో తాగునీటి అవసరాల కోసం ఈ నీటిని భద్రం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే 90 టీఎంసీలతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి జలాశయాల్లో నీటినిలువలు లేకపోవడంతో గత ప్రభుత్వంవేసిన అంచనాలు తప్పాయి. ఈ ప్రాజెక్టు పరిధిలోని రైతులు బోరుబావులపైనే ఆధారపడ్డారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో పంటలు వేసిన 7లక్షల 50 వేల ఎకరాల్లో ఏమేరకు అందుతోందో ప్రశ్నార్థమైంది.

తాగునీటికి ఆల్మ‌ట్టిపైనే ఆధారం..

అయితే.. తాగునీటి అవసరాలకోసం క‌ర్నాట‌క‌లోని ఆల్మట్టి నుంచి 15 టీఎంసీల నీటిని రాష్ట్రానికి తరలించేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నప్పటికీ సాగుభూములను కాపాడే ప్రయత్నం ఎలాచేస్తోందో ప్రశ్నార్థమైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో నీటి ఎద్దడితో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. గత సంవత్సరం ఇదే మాసంలో భూగర్భ జలాలు 8.62 మీటర్ల లోతుకు వెళ్లగా ప్రస్తుతం 12.80 మీటర్ల లోతులోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే మరో మాసంలో మరింత లోతుకు వెళ్లే ప్రమాదం కూడా పొంచి ఉండటంతో వరుణుడు కనికరించి వర్షం కురిస్తేనే సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి.

పశుదాణకు తప్పని ఇక్కట్లు
వ్యవసాయ భూముల్లో పంటలు చేతికి రాకపోతే పశువుల దాణ సమస్యగా మారుతోందనే ఆందోళన వినిపిస్తోంది. ఇప్పటికే పశువులను అడవి ప్రాంతాలకు తరలించి మేత పెడుతున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఏర్పడిన నీటి ఎద్దడితో వ్యవసాయంతో పాటుగా పశువుల పరిస్థితి ఆందోళన గా మారే అవకాశాలున్నాయి. అయితే పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ముందస్తు ప్రణాళికలను సిిద్ధం చేస్తున్నట్లు సంబంధిత అధికారి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement