Saturday, May 4, 2024

కోట్ల విలువచేసే గంజాయి.. ప‌ట్టుకున్న పోలీసులు..

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌: ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు నుంచి మహారాష్ట్రకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న నిషేధిత గంజాయిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం డీసీఏం వ్యాన్‌లో భారీ మొత్తంలో గంజాయిని మహరాష్ట్రకు తరలిస్తున్నట్లు రాచకొండ పోలీసులకు సమాచారం అందింది. హైదరాబాద్‌లోని బోడుప్పల్‌, నాచారం, కీసర ప్రాంతానికి చెందిన షేక్‌ యాసీన్‌, తన్నీరు సంతోష్‌, వాసుదేవ రెడ్డి, రాజేశ్వర్‌, చంచు రవీందర్‌, మంద మధులు ముఠాగా ఏర్పడి గంజాయిని ఏపీలో కొనుగోలు చేసి, అధిక మొత్తానికి మహారాష్ట్రలో విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు బోడుప్పల్‌ ప్రాంతంలో పటిష్ట నిఘా ఏర్పాటుచేశారు. మేడిపల్లి, ఎస్‌వోటీ పోలీసులు వలపన్ని గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు.

దీంతో 1,240 కిలోల గంజాయి ఆవాహనంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి డీసీఎం వ్యాన్‌, ఇన్నోవా కార్‌, టాటా ఏసీ ఆటో, ఇండికా కారు, రెండు సెల్‌ ఫోన్లు, ఐదు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మొత్తం రూ.2.08 కోట్లు ఉంటుందని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ఆరుగురు నిందితుల్లో తన్నీరు సంతోష్‌, వాసుదేవ రెడ్డి, పూనమ్‌ రాజేశ్వర్‌లు పట్టుబడగా, షేక్‌ యాసీన్‌, చుంచు రవీందర్‌, మధులు పరారీలో ఉన్నట్లు సీపీ చెప్పారు. కిలో గంజాయి ఏజెన్సీలోని బ్రోకర్ల వద్ద రూ.8 వేలకు కొనుగోలు చేసి వాటిని ఇతరులకు కిలో రూ.15 వేలకు విక్రయిస్తున్న ట్లు గుర్తించామని వివరించారు. ప్రధానంగా యువతతో పాటు, విద్యార్థులు ఇతర బడా వ్యాపారు లకు గంజాయిని విక్రయిస్తున్నట్లు చెప్పారు.

పది కిలోల చొప్పున ఒక్కో ప్యాకెట్‌ను తయారుచేశారని తెలిపారు. నిందితులపై కఠినంగా వ్యవహరించేలా చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన మల్కాజి గిరి డీసీపీ రక్షితా కృష్ణమూర్తి, ఎస్‌వోటీ అదనపు డీసీపీ సురేందర్‌ రెడ్డి, ఏసీపీలు శ్యాంప్రసాద్‌ రావు, ఎస్‌వోటీ సీఐ రవికుమార్‌, ఎస్‌ఐలు అవినాష్‌ బాబు, రవిలను సీపీ మహేష్‌ భగవత్‌ అభినందించారు. నిషేధిత గంజా యితో పాటు, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే 9490617111 నంబర్‌కు చెప్పాలని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీపీ హామి ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement