Tuesday, October 8, 2024

MDK: కాంగ్రెస్ ది 420 మ్యానిఫెస్టో..: మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్ ది 420 మ్యానిఫెస్టో అని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం మ‌ర్కుక్ లో మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై స్పందించారు. కాంగ్రెస్ ఆచరణకు సాధ్యం కానీ హామీలను ఇస్తోందన్నారు. మ్యానిఫెస్టోతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలెవరూ కాంగ్రెస్ ను నమ్మొద్దని సూచించారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిన కేసీఆర్ ప్రభుత్వమే తెలంగాణలో మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మర్కుక్ దశ, దిశ మార్చింది కేసీఆర్ అన్నారు. నీళ్ల కష్టాలు తీర్చాడు.. రోడ్లు లేక నాడు ఎంతో ఇబ్బందులు పడ్డామ‌ని, నేడు డబుల్ రోడ్లు కనిపిస్తున్నాయన్నారు. నెత్తిమీద గంగమ్మ లెక్క కొండపోచమ్మ సాగర్ తెచ్చింది కేసీఆర్ అన్నారు. తెలంగాణకు తొలి సీఎం కేసీఆర్, దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అన్నారు.

నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటే.. నేడు పోదాం పద సర్కారు దవాఖాన అంటున్నారన్నారు. ఈసారి కారు గెలవగానే సన్నబియ్యం, పాత బియ్యం ఇవ్వబోతున్నామన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ కి పట్టా ఇచ్చి హక్కులు ఇవ్వబోతున్నామ‌న్నారు. సిలిండర్ ధరలు పెంచిన బీజేపీ వాళ్ళని ప్రశ్నించాలన్నారు. రూ.400 లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నామన్నారు. రైతు బంధు రూ.16 వేలు ఇవ్వబోతున్నామని, రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత భీమా, అరోగ్య శ్రీ కింద రూ.15 లక్షల దాకా వైద్యం, సౌభాగ్య లక్ష్మి రూ.3000 ఇవ్వబోతున్నామ‌న్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఒకటో, రెండో సీట్లు వస్తాయన్నారు. బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూతుల్లోనే బుద్ది చెప్పాలన్నారు. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ను మంచి మెజారిటీతో గెలిపించాలని మంత్రి హ‌రీశ్ రావు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement