Saturday, May 4, 2024

Commissioner Review – శాంతియుతంగా మొహర్రం వేడుకలు జరుపుకోండి – రాచ‌కోండ క‌మిష‌న‌ర్ చౌహ‌న్

రాచ‌కొండ – రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొహర్రం వేడుకల సమయంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు పోలీస్ కమిషనర్ డి ఎస్ చౌహాన్ . ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా మొహర్రం పండుగ జరుపుకోవాలని, తమ చర్యల ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులతో సహకరించాలని తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు, వాహన దారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, తీసుకోవలసిన నష్టనివారణ చర్యలు మీద, రానున్న మొహర్రం పండుగ సందర్భంగా చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లు, మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కమిషనర్ డి.ఎస్. చౌహాన్ ఐపిఎస్ రాచకొండ జోనల్ డీసీపీలు, ఏసిపిలు మరియు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

‘ఆలమ్‌లు’ ఏర్పాటు చేసే చోట మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు, బ్లూ కోల్ట్స్ మరియు పెట్రోల్ కార్లు మొదలైన వాటిని ఏర్పాటు చేయాలని, ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొనే సామూహిక ప్రార్థనల వంటి కార్యక్రమాల బందోబస్తు సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అన్ని ప్రముఖ మసీదుల ప్రాంగణాల్లో వాహనాల నంబర్ ప్లేట్ల చెకింగ్, పత్రాల చెకింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రదేశాల్లో బాంబు తనిఖీ బృందాల ద్వారా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. కల్లోలాలు రెచ్చగొట్టే పాత నేరస్తుల మీద నిఘా వేసి ఉంచాలని, వారు ఎటువంటి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

బందోబస్తు ఏర్పాట్లు చేసే సందర్భంలో తగిన సమర్థవంతమైన అధికారులకు విధులు అప్పగించాలని సూచించారు. ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, ఆయా ప్రాంతాల్లో సీసీటీవీల పనితీరును పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. మహిళలు పాల్గొనే సామూహిక ప్రార్థనల చోట్ల ఎవరూ అసభ్యకరంగా ప్రవర్తించకుండా, వారు ఎటువంటి వేధింపులకు గురికాకుండా షి టీమ్స్ బృందాలు ఎల్లవేళలా విధుల్లో ఉండాలని సూచించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మత సామరస్యం కాపాడడానికి అవసరమైన అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించే సోషల్ మీడియా పోస్టులు పెట్టే వ్యక్తుల మీద తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అలాగే. రాచకొండ పరిదిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సామాన్య ప్రజలు, వాహన దారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం అవసరమైన సంరక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన చోట్ల ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, రోడ్ల మీద తెరిచి ఉంచిన మ్యాన్ హోల్స్ పక్కన సూచిక బోర్డులు పెట్టాలని సూచించారు. వర్షం పడే సమయంలో, అవసరం అయితేనే ప్రజలు రోడ్ల మీదకు రావాలని, వీలైనంత వరకు, కార్ల వంటి వాహనాల ఉపయోగానికి దూరంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

జాయింట్ కమిషనర్ సత్యనారాయణ ఐపీఎస్, ఎస్.బి డిసిపి బాలస్వామి ఐపిఎస్, డీసీపీ జానకి ఐపిఎస్, ఎస్.బి ఒ.ఎస్.డి. మహేష్, ఏసిపి జావేద్ , ఏసిపి జగదీష్ చందర్, ఏసిపిలు, ఇన్స్పెక్టర్లు మరియు ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement