Thursday, May 2, 2024

First Meeting సీఎం రేవంత్ ఎన్నిక‌ల శంఖ‌రావం – రేపు ఇంద్రవెల్లి పోరుగడ్డపై బహిరంగ సభ…

ఉమ్మడి అదిలాబాద్, ప్రభ న్యూస్ బ్యూరో – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదిలాబాద్ జిల్లా నుండే పర్యటనకు శ్రీకారం చుట్ట‌నున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుండి ఎన్నిక‌ల‌ శంఖారావం పూరించనున్నారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడమ బొజ్జు, బహిరంగ సభ ఇన్చార్జ్ పటేల్ రమేష్ రెడ్డి ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి బహిరంగ సభ విజయవంతం చేయడానికి లక్ష మందినీ సమీకరించేందుకు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బహిరంగ సభ ఏర్పాట్లపై కీలక బాధ్యతలు తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో సీఎం తొలి బహిరంగ సభ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అసాధారణ రీతిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది.

రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఇదే…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2న మధ్యాహ్నం 12:20 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి నేరుగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ చేరుకుంటారు. 1.35 గంటలకు కిస్లాపూర్ నుండి రోడ్డు మార్గం గుండా నేరుగా నాగోబా ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు. 1.45 గంటల నుండి 2.15 వరకు నాగోబా ఆలయ గోపురం పనులు ప్రారంభించి ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.15 నుండి 3.15 వరకు సీఎం నాగోబా దర్బార్ హాల్లో అభివృద్ధి పనులను సందర్శిస్తారు. అనంతరం రోడ్డు మార్గం గుండా 3.30 గంటలకు చారిత్రక పోరుగడ్డ ఇంద్రవెల్లికి బయలుదేరి అక్కడ అమరవీరుల స్థూపo వద్ద నివాళులర్పించి ఒక ఎకరం స్థలంలో 93 లక్షల వ్యయంతో స్మృతి వనానికి శంకుస్థాపన గావిస్తారు. ఆ తర్వాత సీఎం అక్కడే తొలి బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4:55 గంటలకు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement