Saturday, May 4, 2024

CM: పది రోజుల పాటు రేవంత్ దూరం… మణిపూర్‌కు ఆ తర్వాత దావోస్‌కు పయనం

న్యూఢిల్లీ, ప్ర‌భ‌న్యూస్‌: దేశ‌, విదేశీ పర్యటనలతో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది రోజుల పాటు రాష్ట్రానికి దూరంగా ఉండనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన తుగ్లక్ రోడ్‌లో కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంటికి వెళ్లారు. అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు.

అనంతరం ఎంపీగా ఉన్నప్పుడు తనకు కేటాయించిన యమున బ్లాక్‌కు వెళ్లిపోయారు. కొందరు నేతలు అక్కడికే వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. శనివారం పలువురు కేంద్రమంత్రులను, అధిష్టానం పెద్దలను కలవనున్నట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై చర్చించే అవకాశముంది. అలాగే నామినేటెడ్ పదవుల కోసం ఇప్పటికే ఢిల్లీకి క్యూ కట్టిన నేతలకు సంబంధించి పార్టీ పెద్దలతో మంతనాలు జరిపే అవకాశముందని సమాచారం.

భారత్ న్యాయ్ ప్రారంభ యాత్ర‌కు హాజ‌రు..
సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి భేటీ అవ్వనున్నట్టు తెలుస్తోంది. ఆదివారం రేవంత్ రెడ్డి మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ గ్రౌండ్ నుంచి ప్రారంభమయ్యే రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఢిల్లీకి చేరుకుని ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఇక్కణ్నుంచే స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్‌కు హాజరవుతారు. దావోస్‌లో ప్రతి ఏడాది జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద కంపెనీల అధినేతలు హాజరవుతారు. 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు దావోస్‌లో పర్యటించి తెలంగాణకు విదేశీ పెట్టుబడుల అంశంపై ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నట్టు సమాచారం. దావోస్ పర్యటన అనంతరం మరో మూడు రోజుల పాటు రేవంత్ రెడ్డి లండన్‌లో పర్యటిస్తారు. మళ్లీ ఈనెల 23న ముఖ్యమంత్రి హైదరాబాద్ తిరిగి రానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement