Thursday, April 25, 2024

నీటి వాటాపై కేంద్రాన్ని నిలదీయండి: ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం

సాగునీటి విషయంలో రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వకూడదని టిఆర్ఎస్ ఎంపీలకు ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాటా కోసం ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయాలని, గట్టిగా కొట్లాడాలని చెప్పారు. విభజన హామీల అమలు, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించాలని సూచించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ప్రగతిభవన్​లో సీఎం ఏం కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, వాటి పురోగతి, అమలుపై సమీక్షించారు. విభజన హామీల అమలు, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉభయసభల్లో పోరాడాలని సీఎం ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణకు ఉన్న కేటాయింపుల్లో నుంచే జలాలను వాడుకుంటున్నామని… ఈ విషయంలో ఎక్కడా ట్రైబ్యునళ్లు, చట్టాలకు విరుద్ధంగా వెళ్లలేదని సీఎం చెప్పినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ట్రైబ్యునల్ కేటాయింపులకు విరుద్ధంగా నీటిని బేసిన్ వెలుపలకు తరలిస్తోందని, కేటాయింపులు లేకుండా అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని అన్నట్లు తెలిసింది. కృష్ణాపై కొత్త ప్రాజెక్టులేవీ లేవని… అన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ప్రాజెక్టులేనని మరోమారు వివరించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement