Sunday, May 5, 2024

Clarify – ప్రజల ఆకాంక్ష మేరకే రాష్ట్ర గీతంగా జయ జయహే – సీఎం రేవంత్

హైదరాబాద్ ,ఆంధ్రప్రభ బ్యూరో: ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతోనే కాంగ్రెస్ సర్కార్ ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించామని తెలిపారు. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్టు చేశారు.

అధికారికంగా గుర్తింపు..
తెలంగాణ సాంస్కృతిక వారసత్వంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ఆదివారం సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్టు చేశారు. ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతోనే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా ఉండాలని కాంగ్రెస్ భావిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. రాచరిక పోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉంటుందని స్పష్టం చేశారు. వాహన రిజిస్ట్రేషన్లలో టీఎస్ బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన టీజీ అక్షరాలనే తీసుకురావాలన్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఆ ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement