Monday, May 6, 2024

AP Assembly: మా ధ్యేయం సామాజిక న్యాయం, సమానత్వం లక్ష్యం… గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – సామాజిక న్యాయం, సమానత్వం, సాధికారిత అంశాలతో సమాజంలో ప్రతి వర్గం అవసరాలను తీర్చేరీతిలో ..చిన్నారులు, మహిళలు, వృద్ధులు, రైతులు, చేనేత కార్మికులు, ఇలా అన్ని వర్గాలను ఆదుకునే రీతిలో విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అనేక మార్పులు తీసుకువచ్చామని రాష్ర్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం మధ్యంతర బడ్డెట్ ను ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ర్ట గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం సాగిందిలా…విజయవాడలో ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగిందని, 18.8 ఎక‌రాల్లో 206 అడుగుల డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహాన్ని రూ.404.35 కోట్లతో ఏర్పాటు చేయ‌డం అభినందనీయమన్నారు. ఈ విగ్రహం ఏర్పాటు ప‌ట్ల సీఎం జ‌గ‌న్, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.

పేద‌ల‌కు ల‌బ్ధిచేకూరేలా ప‌థ‌కాలు..
అల్పాదాయ వర్గాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చే నవరత్నాలు కార్యక్రమం అమలు చేశామన్నారు. చిన్నారుల చదువుకు ఆటంకం కలగకూడదని అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశామన్నారు. విద్యార్ధిని, విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో టాబ్‌లు ఇచ్చామన్నారు. విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా మార్చే కృషి జరుగుతుందన్నారు. ఇంగ్లీష్ మీడియం వలన విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీ పడే పరిస్థితి తెచ్చామని గవర్నర్ వెల్లడించారు. విద్యారంగంపై రూ.73,427 కోట్లు ఖర్చు చేశామని, నాడు నేడు పథకంలో మౌలిక సదుపాయాలు సమకూర్చామన్నారు. ఇంత వరకూ గోరుముద్ద కోసం రూ.4,417 కోట్లు ఖర్చు చేశామని, విద్యాకానుక కింద రూ.3,367 కోట్లు ఖర్చు చేశామని, 8, 9 తరగతి పిల్లలకు 9.52 లక్షల ట్యాబ్లు పంపిణీ చేశామని వివరించారు.

వైద్య రంగంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌

- Advertisement -

అందరికీ ఆరోగ్యం బాగుండాలని వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, పేదలకూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆరోగ్య సురక్షలో వైద్య పరీక్షలు నిర్వహించటమే కాదు, చికిత్స సదుపాయాలు కల్పించామని, రాష్ట్రంలో 10,132 విలేజీ హెల్త్ క్లీనిక్లు స్థాపించామని, 53 ఏరియా ఆసుపత్రులు, తొమ్మిది జిల్లా ఆసుపత్రుల్లో వసతులను మెరుగు పర్చామని, 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించామని, ఫ్యామిలీ డాక్టర్ పథకంలో 3.03 కోట్ల ఓపీ సేవలు అందించామని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచామని గవర్నర్ పేర్కొన్నారు.

రైతుల‌కు పూర్తి భ‌రోసా

వ్యవసాయ రంగంపై ప్రసంగిస్తూ రాష్ట్రానికి వెన్నుముక లాంటి రైతులకు భరోసా కల్పించామని, రాష్టంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇప్పటివరకూ 53.53 లక్షల మంది రైతులకు రూ.33,000 వేల కోట్లు రైతు భరోసాలో పంపిణీ చేశామని, 54.75 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్లు బీమా క్లెయిమ్ లు ఇప్పించామని, తుపాన్ కు నష్టపోయిన రైతులకు రూ.347 కోట్లు చెల్లించామని గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరించారు. మహిళ సాధికారిత, శిశుసంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపించామని, వైఎస్ఆర్ ఆసరా కింద 78.84 లక్షల మంది మహిళలకు రూ.25,571 లక్షల కోట్లు పంపిణీ చేశానని, 6.4 లక్షల మంది గర్భిణీలు, 28.62 లక్షల మంది చిన్నారులకు లబ్ధి చేకూరేలా 55.607 అంగన్ వాడీ కేంద్రాలను నిర్వహించామన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కిందట 66.34 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీకి రూ.4,900 కోట్లు, వైఎస్ఆర్ చేయూతకు రూ.14,129 కోట్లు, కాపు నేస్తం కింద రూ.2,029 కోట్లు, ఈబీసీ నేస్తం పథకంలో రూ.1,257 కోట్లు ఇచ్చామన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణం.. నిర్వాసితుల‌కు పున‌రావాసం

రూ.925 కోట్లు గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఖర్చు చేశాం.కర్నూలులో 77 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకున్నామని. వెలుగొండ ప్రాజెక్టు రెండవ టన్నల్ కొన్ని రోజుల్లోనే పూర్తిచేస్తాం. కుప్పం నియోజకవర్గానికి కుప్పం బ్రాంబ్ కెనాల్‌ను పూర్తిచేస్తాం. 9 డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులను వివిధ జిల్లాల్లో కేటాయించాం. 13 జిల్లాలద్వారా పాలన ప్రజలకు వెళ్లింది. 4000 గ్రామల్లో ఇప్పటికే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూక్కు భూరక్షకింద 100 సంత్సరాల తరువత సర్వే నిర్వహిచాం. ఏదైనా సంక్షేమ పథకం అర్హులకు అందకపోతే గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా వెళ్లి వారికి అందించాం.

బాపూజీ మాటలతో….

చివరగా… ‘‘సమాజం పురోగతి అత్యంత దుర్భలమైన, బలహీనుల స్ధాయిని బట్టి నిర్ణయించబడాలి. అభవృద్ధి అంచుల్లో నిలబడ్డ వారిని ఇతరుల స్ధాయికి తీసుకురావాల్సి ఉంది” అని మహాత్మాగాంధీ మాటల్లో వివరించిన గవర్నర్ ప్రసంగాన్ని ముగించారు. గవర్నర్ స్పీచ్ ముగిసిన తరువాత జై జగన్ అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలోనే నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ రేపటి (మంగళవారం)కి వాయిదా పడింది. కాసేపట్లో బీఏసీ సమావేశం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement