Thursday, May 2, 2024

BRS Election Campaign – పైరవీకారులు కావాల్నా .. మంచి ప్రభుత్వం కావాల్నా..ఆలోచించండి.. కెసిఆర్

హలియా – తెలంగాణ రైతులకు, ప్రజాలకు పెను ప్రమాదం పొంచి ఉంది, కాంగ్రెస్ గెలిస్తే ఉచిత కరెంటు ఉండదు, రైతు బంధుకు రాం రాం, దళిత బంధుకు జై బీమ్ తప్పదు, మూడు గంటల కరెంటే దక్కుదల, 10 హెచ్పీ మోటార్లు పెట్టుకోవాలి, ఒక్క సారి ఆలోచించండి, దళారీ రాజ్యం కావాలా? పైరవీల రాజ్యం కావాలా? మంచి చేసే పార్టీ కావాలా? చెడు చేసే సర్కారు కావాలా? ఆలోచించండి అని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు ప్రజలను ప్రశ్నించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో మంగళవారం జరిగిన ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలోనే అంతా నష్టమే జరిగిందని, మళ్లీ జనాన్ని దెబ్బతీసేందుకే వస్తోందన్నారు.

అత్యంత కీలక ధరణి పోర్టల్ వద్దంటున్నారని, రాహుల్ గాంధీ, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ధరణి పోర్టల్ను బంగాళా ఖాతంలో కలిపేస్తామని బాహటంగా చెబుతున్నారని కేసీఆర్ వివరించారు. ఇక ఉచిత కరెంటు వృథా అని, మూడు గంటలు సరఫరా చేస్తే సరిపోతుందని పీసీనీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నాడని, 10 హెచ్పీ మోటార్లు పెట్టుకోవాలని సలహాలిస్తున్నారని, ఇది సాధ్యమా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

ఇక కర్ణాటక ఉప ముఖ్య మంత్రి డీకే శివకుమార్ వచ్చి.. తమ రాష్ర్లంలో ఐదు గంటలు ఉచితంగా కరెంటు ఇస్తున్నామని చెబుతున్నారని, కానీ తెలంగాణాలో 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తున్నామని ఆయనకు తెలీదన్నారు. తెలంగాణలో రైతులు బాగుంటే, రాష్ర్టం బాగు పడుతుందని, రైతులకు మేలు జరగాలని రైతు బంధు, రైతు బీమా, ధరణి పోర్టల్ ను తీసుకువస్తే.. కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని కేసీఆర్ వివరించారు. ఇప్పుడు కరెంటు సమస్య లేదు. నీటి తీరువా సమస్య లేదు. నీటి తీరువాను రద్దు చేశాం. రైతులకు మేలు కోసమే బీఆర్ఎస్ పని చేస్తోందని, ఉచిత కరెంటును వృథా అనే నాయకుడు కావాలా? కరెంటు ఇచ్చే నాయకుడు కావాలా? ఒక్కసారి ఆలోచించండి. అని కేసీఆర్ అన్నారు.

రెండేళ్లల్లో ఉచిత కరెంటు ఇస్తామని అసెంబ్లీలో చెబుతుంటే, రెండేళ్లు కాదు..నాలుగేళ్లల్లోనూ ఉచిత కరెంటు ఇవ్వలేరని, ఒకవేళ మీరు ఇస్తే గులాబీ కండువా కప్పుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరతానని చెప్పిన జానారెడ్డి మాట మీద నిలబడలేదని, ఇప్పుడు తానే ముఖ్య మంత్రి అవుతానని పంచరంగుల కలలు కంటున్నారని కేసీఆర్ ఎద్దెవ చేశారు. జానా రెడ్డి మంత్రిగా పని చేశారని, ఏనాడన్నా డిగ్రీ కాలేజీ తీసుకువచ్చారా? భగత్ తన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, హాలియాలో ఎత్తిపోతల పథకం కోసం శ్రమించారని, 5 వేల క్యూసెక్ల సామర్థ్యాన్ని 24 వేలకు పెంచామని, ఈ ఎత్తిపోతల పథకం త్వరలో పూర్తవుతుందని, ఈ ప్రాజెక్టును తానే ప్రారంభిస్తానని కేసీఆర్ వివరించారు.

- Advertisement -

ఎవ్వరు అడ్డొచ్చినా గెలిచేది బీఆర్ఎస్ అని, అభివృద్ధిని గుర్తించి ఓట్లు వేయాలని కేసీఆర్ సూచించారు. హడావిడిగా, అబద్ధాలతో బద్నామ్లతో కాంగ్రెస్ ప్రచారాన్ని నమ్మి ఆగం ఆగంగా ఓట్లు వేమొద్దని కేసీఆర్ ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ వస్తే… ఇక అన్నీ కష్టాలేనని, అభివృద్ధితో పని లేదని, పైరవీలు, దళారీలదే రాజ్యం వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement