Wednesday, May 15, 2024

తెలంగాణ పథకాలను బీజేపీ కాపీ కొడుతోంది.. అసెంబ్లీలో పద్దుల చర్చపై ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను బీజేపీ కాపీ కొడుతుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా పద్దులపై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన పద్దులపై మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ సస్యశామలంగా మారిందని, దేశానికి వెన్నుముక రైతులైతే… రైతులకు కేసీఆర్‌ వెన్నుముక అని పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి ధాన్యం పండించడంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని చెప్పారు. కేసీఆర్‌ పాలన రైతులకు స్వర్ణయుగమని ఆయన కొనియాడారు. క్రీస్తు పూర్వం..క్రీస్తు శకం మాదిరిగానే బిఫోర్‌ కేసీఆర్‌…ఆఫ్టర్‌ కేసీఆర్‌ అని ఆయన పాలన దక్షత గురించి పాఠ్యపుస్తకాల్లో పొందుపర్చాలని కోరారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకం, చేపల పెంపకం వృద్ధి చెందిందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలనే కాదు..లేని అంశాలనూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తోందని, ఆ తరహాదే దళిత బంధు పథకమని ఆయన గుర్తుచేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎంపీ అరవింద్‌ కుమార్‌ ఆ జిల్లా ప్రజలకు వాగ్దానం చేసి బాండ్‌ పేపర్‌ రాసిచ్చారని, దాన్ని ఇంత వరకూ తీసుకురాలేదని ఆయన ఆరోపించారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పిందే కాదు చెప్పనివి కూడా చేస్తోందన్నారు.

పైసలెక్కువ.. చప్పట్లు తక్కువ!
పద్దులపై సభలో చర్చ జరుగుతున్న సందర్భంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై శాసన సభలో ఆయన సుధీర్గంగా మాట్లాడారు. రైతుల సమస్యలు, ధాన్యం సేకరణ, సాగు ప్రాజెక్టుల ద్వారా పంటలకు నీళ్లు విడుదల, నీలి విప్లవం, పింక్‌ విప్లవం, ఎల్లో విప్లవాలను కేసీఆర్‌ తీసుకొచ్చారని కొనియాడుతూ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోని గత ప్రభుత్వాల పాలన తీరు, ప్రస్తుత కేసీఆర్‌ పాలనలో సంక్షేమానికి నిదుల కేటాయింపులను ప్రస్తావిస్తూ మాట్లాడిన సందర్భంలో సభలో మిగతా టీఆర్‌ఎస్‌ సభ్యులందరూ మౌనంగా ఆయన ప్రసంగాన్ని వింటున్నారు. అయితే వాళ్లను ఉద్దేశిస్తూ జీవన్‌ రెడ్డి ఇలా అన్నారు.. సభ్యులు చప్పట్లు కొట్టాలి.. పైసలెక్కువ (బడ్జెట్‌లో కేటాయింపులు) చప్పట్లు తక్కువ కొడుతున్నారని.. అందరూ చప్పట్లు కొట్టాలన్నారు. ఇలా పదే పదే అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. ఆయన మాట్లాడినంతసేపు సభలో ఒకటే నవ్వులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement