Monday, April 29, 2024

నకిలీ ఖాతాలు సృష్టించి రూ.1.15 కోట్లు మింగేసిన బ్యాంకు అధికారులు.. జగిత్యాల జిల్లాలో ఘటన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లాలోని గ్రామీణ మండలం చల్‌గల్‌ యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (యూబీఐ) బ్యాంకులో భారీ మోసం వెలుగు చూసింది. ఈ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న మేనేజర్‌ సుమన్‌, క్లర్క్‌ రాజేష్‌ ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు జరుపుతున్న విచారణలో బయటపడింది. ఈ ఇరువురు అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మహిళా సంఘాలు, రైతులు బ్యాంకులో జమ చేసిన డబ్బులను తన పేరిట నకిలీ ఖాతాలు సృష్టించి ఆ మొత్తాలను ఆ ఖాతాల్లో జమ చేసినట్టు పోలీసులు గుర్తించారు. తాము జమ చేసిన సొమ్ములో తేడా రావడంతో రైతులు, మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

ఏడాది క్రితమే ఈ కుంభకోణం బయట పడగా ఇటీవల బదిలీపై వచ్చిన కొత్త బ్యాంకు మేనేజర్‌ మోతీలాల్‌ గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దాదాపు కోటి 15లక్షల 47వేల రూపాయలను సుమన్‌, రాజేష్‌లు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించినట్టు విచారణలో బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపులు తీవ్రతరం చేశారు. మహిళా సంఘాలు, రైతులు వ్యక్తిగత రుణాల పేరుతో నగదును కాజేసి ఏమీ తెలియనట్టు సుమన్‌, రాజేష్‌లు వ్యవహరించారని బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే వీరిద్దరిని సస్పెండ్‌ చేశామని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే ఇంకెన్ని నిధులు దిగమింగారో బయట పడుతుందని జగిత్యాల గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement