Tuesday, April 30, 2024

BJP Cluster Meeting – 28న క‌రీంన‌గ‌ర్ కు కేంద్ర హోం మంత్రి రాక ..

క‌రీంన‌గ‌ర్ – కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 28న కరీంనగర్ రానున్నారు. ఆరోజు బీజేపీ నిర్వహించే క్లస్టర్ సమావేశానికి హాజరుకానున్నారు. దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని క్రియాశీల కార్యకర్తలతో నిర్వహించే సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సమ్మేళనంలో ఒక్కో పోలింగ్ బూత్ పరిధిలోని 20 మంది కార్యకర్తల చొప్పున పార్లమెంట్ పరిధిలో దాదాపు 40 వేల మంది కార్యకర్తలు పాల్గొననున్నారు.

ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని లహరి ఫంక్షన్ హాలులో జరిగిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ విషయాన్ని ప్రకటించారు. సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, గంగాడి క్రిష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ, అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, రాష్ట్ర నాయకులు మీసాల చంద్రయ్య, క్రిష్ణారెడ్డి, చెన్నమనేని వికాస్ రావు, ఆరెపల్లి మోహన్, బాస సత్యనారాయణ, బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికలను పార్టీ నేతలను సమాయాత్తం చేయడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ అంతర్గత సమావేశానికి దాదాపు 700 మంది మంది నాయకులు వచ్చారు. వీరిలో ఒక్కొక్కరిని ఒక్కో ఎంపీటీసీ ప్రాతినిధ్యం వహించే ప్రాంతానికి సమన్వయకర్తలుగా నియమించారు. రాబోయే ఎన్నికల్లో తమకు అప్పగించిన గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలను సమన్వయం చేయడంతోపాటు అత్యధిక ఓట్లు సాధించి గెలుపే లక్ష్యంగా చేసుకుని పనిచేయనున్నారు.

ఈ సందర్భంగా సమావేశానికి వచ్చిన నాయకుల్లోని జోష్ ను చూసిన సంజయ్ మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తల జోష్ చూసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘‘నా బలం…బలగం మీరే. సిరిసిల్ల జిల్లాలో అధికారంలో ఉన్నన్నాళ్లు కేటీఆర్ బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా భరించారు. కొిట్లాడారు. జైలుకు వెళ్లారు. మీ పోరాటానికి హ్యాట్సాఫ్’ అని పేర్కొన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది మోడీ సర్కారేననే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రంలోనూ బీజేపీ నుండి అత్యధిక మంది ఎంపీలు గెలిస్తేనే తెలంగాణకు అదనపు నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే మోడీతోనే సాధ్యమనే భావన కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తామని ఆ పార్టీల కార్యకర్తలు కూడా చెబుతున్నారని తెలిపారు.

- Advertisement -

ఇక తనను ఎంపీగా గెలిపించిన తరువాత చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తరువాత ఏనాడూ ఖాళీగా కూర్చోలేదని… బీజేపీ కార్యకర్తలు తలెత్తుకుని కాషాయ జెండా పట్టుకుని తిరిగేలా పోరాటాలు చేశానన్నారు. కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్, మోడీ చేసిందేమిటని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎంపీగా గెలిచాక దాదాపు 10 వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధికి పాటుపడ్డానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చిందనే పూర్తి వివరాలను వెల్లడించడంతోపాటు అతి త్వరలో గ్రామ గ్రామాన ఈ మేరకు ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల నోళ్లు మూయిస్తానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement