Monday, April 29, 2024

Assembly – బీఆర్ఎస్, బీజేపీ ఫెవికాల్ బంధం – సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని విషయాలను ఆ పార్టీ నేతలకు చెబుతారు.. మరికొన్నింటిని దాచిపెడతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా మాట్లాడారు. పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అండగా నిలిచిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి బిల్లుకూ బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. ఆ రెండు పార్టీల నేతలు కలిసి పలుమార్లు చర్చించుకున్నారన్నారు. ముఖ్యమంత్రిని మార్చుకునే విషయాన్ని కూడా ప్రధాని మోదీ ఇక్కడకు వచ్చి చెప్పారన్నారు. ముఖ్యమంత్రులను మార్చుకోవడం మీ అంతర్గత విషయం.. కానీ, దీన్ని కూడా మోదీ చెప్పారంటే బీఆర్ఎస్, బీజేపీ ఫెవికాల్ బంధం తెలుస్తోందన్నారు. కానీ, ఈ విషయం ఇతర బీఆర్ఎస్ నేతలకు తెలియదేమో అన్నారు.

2014 నుంచి 2023 చివరి వరకు పార్లమెంట్‌లో ఏ సందర్భంలో అయినా ఎన్డీయేకు బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. 2011 శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయన్నారు. నాటి ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, ఎండల లక్ష్మీనారాయణలు అధికారికంగా నాటి టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేశారన్నారు. అదే సమయంలో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, కావేటి సమ్మయ్య, కల్వకుంట్ల విద్యాసాగర రావు.. నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేశారన్నారు. కేసీఆర్ అల్లుడి ప్రోద్భలంతోనే కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసినట్లు వారు బహిరంగంగా చెప్పారన్నారు.

బిజెపి, బిఆర్ఎస్ మ‌ధ్య ఏ బంధం లేదు – పోచారం ..

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి బంధం లేదని రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపిల‌ను బీఆర్ఎస్ ఓడించిందని చెప్పారు. సీఎంను మార్చుకోవాలంటే ఎవరి అనుమతి అవసరం లేదని.. బీఆర్ఎస్ కే గత ప్రభుత్వం హయాంలో 100 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉందన్నారు. ఊహించి చెప్ప‌డం రేవంత్ స్థాయికి త‌గ‌దంటూ కౌంట‌ర్ ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement