Tuesday, October 8, 2024

అధికార పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి రాజీనామా

(ప్రభాన్యూస్ బ్యూరో,ఉమ్మడి కరీంనగర్) – కరీంనగర్ జిల్లా మానకొండూరు మాజీ శాసనసభ్యుడు, మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ అధికార బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అధికార పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు గురువారం సాయంత్రం కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి చెందిన కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు, పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్, నాటి పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అభ్యర్థన మేరకు మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తాను బీఆర్ఎస్ లో చేరినట్టు తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, బంగారు తెలంగాణ సహకారం అవుతుందని భావించానని చెప్పారు.
తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని, వారి ఆత్మలు ఇంకా ఘోషిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో బీసీలు, దళితులకు పూర్తిగా న్యాయం జరగలేదని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.
మానకొండూరు నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా అభివృద్ధి తోపాటు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడాలనే తపనతో ప్రజల గొంతుకగా మారాలనే ఉద్దేశంతో, అధికార పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement