Tuesday, April 30, 2024

అడ్డం, పొడుగు పెరిగినా.. అంతా ప్లానింగ్ ప్రకారమేనట..

హైదరాబాద్, (ప్ర‌భ‌న్యూస్) : హైదరాబాద్‌ రోజు రోజుకీ ఆధునిక హంగులను అద్దుకుంటూ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుంది. ఓ వైపు ఐటీ,. మరోవైపు మెడికల్ రంగంలో దూసుకుపోతుంది. దీంతో రోజు రోజుకీ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా వారి అవసరాలకు తగిన విధంగా సదుపాయాలను కల్పించే దిశగా తెలంగాణ సర్కార్‌ అడుగులు వేస్తోంది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా నగరాన్ని విస్తరిస్తూ శివారు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళిక బద్ధమైన చర్యలను అవలంబిస్తోంది. దాంతో పాటు నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణకు అవసరాల మేరకు రోడ్ల వెడల్పు పనుల నేపథ్యంలో భూసేకరణ ప్రక్రియను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు వేగవంతం చేశారు.

హైదరాబాద్‌ నగర ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనలో జీహెచ్‌ఎంసీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. 650 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో, కోటికి పైగా జనభాను కలిగి ఉండటంతో నగరంపై భారం పెరుగుతోంది. దాంతో నగర విస్తరణతో పాటు, ముఖ్యంగా నూతన మాస్టర్‌ ప్లాన్‌ అమలులో రోడ్ల వెడల్పు, అభివృద్ధి, లింకు రోడ్లు, స్లీవ్‌ రోడ్లు, జంక్షన్‌ అభివృద్ధి, ప్లైఓవర్‌ అండర్‌ పాస్‌ అనేక అభివృద్ధి పనుల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఔటర్‌ రింగు రోడ్డును ఆనుకొని శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులైన రోడ్డు, తాగునీరు, డ్రైనేజి, విద్యుత్‌ వంటి వాటిని కల్పించేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. గ్రామ పంచాయితీలు, మునిసిపా లిటీల్లో నిధులు సరిపడా లేకపోవడంతో ప్రభుత్వం హెచ్‌ఎండీఏ నుంచి నిధులు కేటాయించడంతో పాటు పనులు చేపట్టే బాధ్యతను అప్పగిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement