Sunday, April 28, 2024

Big story | రాష్ట్రానికి పోటెత్తిన వ్యవసాయ కూలీలు.. వరిపొలాల్లో నాట్లు వేస్తూ సందడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస వ్యవసాయ కూలీలు రాష్ట్రంలో సాగుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. సకాలంలో వరినాట్లు, కలుపుతీత తదితర సాగు పనులు అదనులో పూర్తయ్యేలా రైతులకు అండగా ఉంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ చేపట్టిన జలయజ్ఞం, మిషన్‌కాకతీయ కార్యక్రమాలతో రాష్ట్రంలో సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా వరి, పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అదే సమయంలో ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో అదనులో వరినాట్లు, పత్తి విత్తనాలు పడుతాయా..? లేదా..? అన్న ఆందోళనలో రైతులు కూరుకుపోయారు. ఆ సమయంలో ఆలస్యంగానైనా ఉన్నట్టుండి భారీ వర్షాలు కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వరినాట్లు ముమ్మరమయ్యాయి. ఇటీవల వర్షాలు విస్తారంగా కురవడంతో రైతులందారు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 70శాతం రైతులు వరినాట్లు వేసే పనుల్లో తీరికలేకుండా ఉన్నారు.

రౖైెతులంతా ఒకేసారి వరినాట్లకు సిద్దమవడంతో కూలీల కొరత ఏర్పడింది. కూలీలకు డిమాండ్‌ ఏర్పడడంతో కూలీరేట్లు కూడా పెరిగాయి. ఈ తరుణంలో బీహార్‌, హర్యాణా , ఉత్తర ప్రదేశ్‌తోపాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన కూలీలు రైతులకు కూలీల కొరతను దూరం చేస్తున్నారు. దీంతో రైతులు అనుకున్న సమయానికి అదనులో వరి నాట్లు పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లో నాలుగు రోజుల క్రితం వారంపాటు విస్తారంగా వర్షాలు కురవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసకూలీలు వరిపొలాల్లో నాట్లు వేస్తూ కనిపిస్తున్నారు. రైతులు తమ గ్రామంలోని కూలీలతో పంటలు వేసుకోవాలంటే చాలా రోజులు పడుతోందని, వర్షాల వల్ల వచ్చి నీరు ఆలస్యం చేస్తే ఇంకిపోయి నాటుకు కష్టమవుతుందని రైతులు చెబుతున్నారు. ఈపరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యవసాయ కూలీలు తమకు ఎంతో మేలు చేస్తున్నారని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -


తెలంగాణలోని వ్యవసాయ కూలీల కంటే వలస కూలీలు నాటుకు డబ్బులను కూడా తక్కువగానే తీసుకుంటున్నారని, స్థానిక కూలీలకంటే అదనపు పనిగంటలు పనిచేస్తూ సకాలంలో వరిపొలాల్లో నాట్లు పడేలా చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. స్థానిక కూలీలకైతే ఎకరా నాటుకు రూ.5నుంచి రూ.6వేలు చెల్లించాల్సి వస్తుండగా వలస కూలీలు ఎకరాకు నాలుగు నుంచి నాలుగు వేలు తీసుకుని నాటు పూర్తి చేస్తున్నారని చెబుతున్నారు. వలస కూలీలు ఒక గ్రూప్‌లో 20 మంది ఉంటారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల పాటు- విరామం లేకుండా వరి నాట్లు- వేస్తున్నారు. దీంతో రోజు ఏడు ఎకరాల వరకు వరి నాటు- వేయడంతో నెల రోజుల్లో గ్రామాల్లో నాట్లు- పూర్తి ఆవుతున్నాయి. పైగా రైతులకు శ్రమ లేకుండా వారే వరి నారు చేనుపై వేసుకుంటారు. రైతు పోలం దమ్ము కొట్టించి బురద మందు చల్లుకుని కూర్చుంటే చాలు వారే వరి నాటు- వేసి వెళ్తారు. దీంతో రైతులకు ఎలాంటి కష్టం లేకుండా పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement