Sunday, May 5, 2024

బోధన అభ్యాసన పరికరాలు.. తరగతి గదికి గొప్ప ఆభరణాలు..

బెల్లంపల్లి : తరగతి గదిలో ఉపాధ్యాయుల పాఠ్యబోధనకు బోధన అభ్యాసన పరికరాలు గొప్ప ఆభరణాలు అని ఆదిలాబాద్‌ రీజినల్‌ సంక్షేమ ఆర్‌సీఓ కొప్పుల స్వరూపరాణి అన్నారు. సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలో జరిగిన ఆదిలాబాద్‌ రీజినల్‌ స్థాయి తెలుగు బోదన అభ్యాసన పరికరాల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు తమ సృజనాత్మకతను ఉపయోగించి పాఠ్యాంశానికి తగినట్లుగా రూపొందించుకున్న బోధన అభ్యాసన పరికరాలు విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయని అన్నారు. తెలుగు పాఠ్య బోధనల్లో ముఖ్యంగా పద్యభాగంలోని పద్యాలను కావ్యంగా, లయబద్ధంగా పాడటం ద్వారా తరగతి గది రసవత్తరంగా మారుతుందని, ఆ దిశగా తెలుగు ఉపాధ్యాయులు సాధన చేయాలని అన్నారు. సంక్షేమ గురుకుల కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఆదిలాబాద్‌ రీజియన్‌లోని 17 గురుకులాలకు సంబంధించిన ఉపాధ్యాయులను సబ్జెక్టు ఫోరంగా ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతీ సబ్జెక్ట్‌లో అనుభవాజ్ఞులైన నిపుణులతో ఎప్పటికప్పుడు బోధనపై ప్రత్యేక తర్ఫీదును ఇస్తున్నామని, అందులో భాగంగానే బెల్లంపల్లి సీఈఓలో తెలుగు సబ్జెక్ట్‌ ఫోరంను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ వృత్యాంతర శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని పాఠ్యాంశం బోధనలో మెలుకువలు నేర్చుకొని ఉన్నతంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌సీఓ కోటిచింతల మహేశ్వర్‌రావు, సీఓఈ ప్రిన్సిపాల్‌ ఐనాల సైదులు, బాలికల ప్రిన్సిపాల్‌ స్వరూప, కాసిపేట ప్రిన్సిపాల్‌ తోట రాజ్‌కుమార్‌, చేరాల లావణ్య, సీనియర్‌ ఉపాధ్యాయులు, దూలం ఎల్లయ్య, స్పానిల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ వినోద్‌కుమార్‌, ఆదిలాబాద్‌ రీజియన్‌ 17 గురుకులాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement