Tuesday, April 30, 2024

TS: అన్నివర్గాల ప్రజల సంప్రదాయాలను గౌరవిస్తున్న ప్రభుత్వం.. మంత్రి తలసాని

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలకు ఏర్పాట్లు చేస్తూ అన్నివర్గాల ప్రజల ఆచారాలు సంప్రదాయాలను గౌరవిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రోజున గణేష్ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై నెక్లెస్ రోడ్ లోనిపీపుల్ ప్లాజాలో ఎమ్మెల్యే దానం నాగేందర్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కమిషనర్, అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, ఇవిడిమ్ చంద్రకాంత్ రెడ్డిలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఈసారి జిహెచ్ఎంసి పరిధిలో ప్రతి గల్లీలో ప్రతి అపార్ట్ మెంట్ లో విగ్రహాలు పెట్టడం జరిగిందని, ప్రతి సంవత్సరం కంటే 25శాతం ఎక్కువ విగ్రహాలు ప్రతిష్టించారని, దానికి తగినట్లుగా నిమజ్జన ఏర్పాట్లు చేయాలని మంత్రి అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాటు జరగకుండా విజయవంతం చేయాలన్నారు.

ఇది సాంప్రదాయకమైన పద్ధతి అని భారతదేశం మొత్తంలో హైదరాబాదులోనే బ్రహ్మాండంగా భారీ ఎత్తున నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. నిమజ్జనం కోసం ఎన్ని క్రేన్లు కావాలన్నా ఏర్పాట్లు చేస్తామని, ఒత్తిడి లేకుండా చాలాచోట్ల బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు ముందుగానే ఏ రూట్ లో వచ్చి ఏ ప్రదేశంలో నిమజ్జనం చేయాలన్న విషయం తెలియజేయడం జరిగిందన్నారు. బార్ కేడింగ్ లైటింగ్, జనరేటర్లు, అన్నియు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో శాంతిభద్రతలు నిర్వహించబడతాయని, వారికి కావలసిన అదనపు బలగాలను ఇతర జిల్లాల నుండి తెప్పించుకొని విధులు పకడ్బందీగా నిర్వహిస్తారన్నారు. ఈసారి సుమారు 90వేల విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు, దానికి తగ్గట్లు నెక్లెస్ రోడ్డు ట్యాంక్ బండ్ మీద క్రేన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకప్పుడు పూణే ముంబైలోనే ఉండేదని నేడు వాటికి మించి హైదరాబాదులో కూడా ఘనంగా జరుగుతున్నట్లు, ఈనెల 28న గణేష్ నిమజ్జనం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖల, జలమండలి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement