Monday, April 29, 2024

టీఆర్ఎస్ కు షాక్.. సాగర్ పోరులో వైసీపీ!

తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక వేడి పెంచుతోంది. ప్రధాన పార్టీలన్నీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై దృష్టిసారించాయి. ఇప్పటికే ఆయా పార్టీల నాయకులు నియోజకవర్గంలో మకాం వేశారు. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ ఉపపోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా మళ్లీ నాగర్జున సాగర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూతతో సాగర్​ స్థానానికి ఖాళీ ఏర్పడడంతో ఈ ఉపఎన్నికను నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ తరుపున నోముల కుమారుడు భాగత్, కాంగ్రెస్ తరుపున జానారెడ్డి బరిలో ఉన్నాయి. అయితే, తాజాగా అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ అభ్యర్థి నామినేషన్ వేయడం ఆసక్తి రేపుతోంది.

ఇప్పటి వరకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు 13 నామినేషన్స్ దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ తెలిపారు. గురువారం నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ఆరుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు. ఇప్పటివరకు 12 మంది ఇండిపెండెంట్, ఒకరు వైయస్ఆర్సీపీ అభ్యర్థితో కలిపి మొత్తం 13 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్టు వెల్లడించారు. ఇప్పటివరకు తెలంగాణలో ఉన్న వైసీపీ అభిమానులు అనధికారికంగా టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ బంధం కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ సహా తెలంగాణలో జరిగిన పలు ఎన్నికల్లో వైసీపీ.. టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఇప్పుడు వైసీపీ నుంచి సాగర్ ఉపఎన్నికకు నామినేషన్ దాఖలు కావడం చర్చనీయాంశంగా మాంది.

ఇదిఇలా ఉంటే.. సాగర్ ఉపఎన్నికలో తెలంగాణ అమరవీరుల కుటుంబసభ్యులు 400మంది నామినేషన్ వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమరవీరుల కుటుంబాలకు రూ. 10లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి హామీలను ప్రభుత్వం పట్టించుకోనందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో పసుపు రైతులు ఇలానే చేసి, నిజామాబాద్ ఎంపీగా కవితను ఓడించారు. దీంతో సాగర్ ఉపఎన్నికలో గెలుపుపై టీఆర్ఎస్ లో ఆందోళన నెలకొందని తెలుస్తోంది.

కాగా, సాగర్ ఉపఎన్నికకు నోటిఫికేషన్​ విడుదలవడంతోనే నామినేషన్లు మొదలయ్యాయి. మొదటి రోజు ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ నెల 30 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 31న నామినేషన్లను పరిశీలిస్తారు. ఏప్రిల్​ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్​ 17న పోలింగ్​, మే 2న ఓట్ల లెక్కింపును నిర్వహిస్తారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి  7 గంటల వరకు కొనసాగుతుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement