Thursday, May 2, 2024

ఏపీలో భారీగా పెన్షన్ల కోత.. కారణాలు ఇవేనా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన వారికి సామాజిక పెన్షన్లు అందిస్తుంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కళాకారులు, గీతకార్మికులకు నెలనెల పెన్షన్లు అందిస్తోంది. అర్హులైన వారికి ప్రతి నెల 1వ తేదీన గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేస్తోంది. అయితే పెన్షన్ల లబ్ధిదారుల్లో కొందరు అనర్హులున్నారన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది. ముఖ్యంగా వితంతు, ఒంటరి మహిళల పింఛన్లపై తనిఖీ చేపట్టింది. ఈ రెండు కేటగిరీల్లో పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారుల రైస్ కార్డులు, ఆధార్ కార్డులను ప్రభుత్వం పరిశీలించింది. ఇందులో దాదాపు లక్షమందికి పైగా లబ్ధిదారుల వివరాల్లో మార్పులున్నట్లు గుర్తించారు.

ఆధారాల్లో తేడాలున్నవారికి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం ఇప్పటికే 6వేల మందిని అనర్హులుగా తేల్చినట్లు సమాచారం. అనర్హులుగా తేలిన వారికి జూలై 1న పింఛన్ల పంపిణీని నిలిపేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే నోటీసులు అందుకున్నవారిలో సరైన ధృవపత్రాలు సమర్పిస్తేనే జూలై నెలకు సంబంధించిన పెన్షన్ ఇస్తారు. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఒంటరి మహిళలు కాకున్నా పెన్షన్ పొందుతున్నట్లు తేలింది. ఈనెల 30 వరకు తనిఖీ ప్రక్రియ కొనసాగనుంది. నోటీసులు అందుకున్న వారు జూలై 15లోగా సంబంధిత ధృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అన్నీ సరిపోలితే ఆగస్టు 1న రెండు నెలలకు సంబంధించిన పెన్షన్లు అందిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన రైస్ కార్డుల్లో వితంతు, ఒంటరి మహిళలకు సంబంధించి భర్త పేరు ఉండటం, భర్త స్థానంలో కుమారుడి పేరు నమోదై ఉండటం, ఈ-కేవైసీలో జెండర్ తప్పుగా నమోదవడంతో పాటు సంబంధిత సర్టిఫికెట్లు అందజేయకపోవడం జరుగుతుంది.

ఇది కూడా చదవండి: వైఎస్ఆర్ బీమా పథకంలో మార్పులు.. తక్షణమే రూ.లక్ష సాయం

Advertisement

తాజా వార్తలు

Advertisement