Sunday, June 13, 2021

వివేకా హత్య కేసు.. కీలక సమాచారం సేకరించిన సీబీఐ

ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నాలుగవ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది. కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా, మాజీ డ్రైవర్ దస్తగిరిలను సీబీఐ అధికారులు మరోసారి విచారిస్తున్నారు. పులివెందులకు చెందిన మరి కొంతమంది అనుమానితులు ఇవాళ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

కాగా, వివేకా హత్య కేసు కొంత కాలం విరామం తర్వాత సోమవారం నుంచి మళ్లీ విచారణ మొదలైంది. కడప జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ జైల్‌లో ఉన్న గెస్ట్‌ హౌస్‌లో ఈ విచారణ జరుగుతోంది. గతంలో పలుమార్లు దర్యాప్తు జరిపినప్పటికీ కీలక ఆధారాలు సంపాదించడంలో విఫలమైన సీబీఐ… ఈసారి పకడ్బందీగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు విచారణలో భాగంగా వివేకానంద రెడ్డి మాజీ డ్రైవర్‌ దస్తగిరిని ఉదయం నుంచి సాయంత్రం 4 వరకు దాదాపు 7 గంటల పాటు విచారించారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. ఇప్పటికే వివేకా కుమార్తే సునీత.. కేసు విచారణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణను వేగవంతం చేయాలని కోరారు. వివేక కుమార్తె సునీత వివేకా కేస్ ఆలస్యం అవుతుందని చెప్పినప్పటి నుంచి సీబీఐ అధికారులు దూకుడుగానే విచారణ చేపడుతున్నారు. కీలక హార్డ్‌ డిస్క్‌లు, డాక్యుమెంట్లును కూడా పరిశీలిస్తున్నారు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానందరెడ్డిని 2019 మార్చి 14న దుండగులు కిరాతంగా హత్య చేశారు. ఎన్నికలకు కొద్ది రోజులు జరిగిన ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. అప్పటి ప్రభుత్వం ఈ హత్యపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. అయితే, సిట్ ఆ దర్యాప్తులో ఏమీ తేల్చలేకపోయింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా సిట్ వేయగా.. కేసు ఎంతకీ తేల్చకపోవడంతో వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత హైకోర్టు ఆశ్రయించారు. వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. సీబీఐ విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతోంది.

ఇదీ చదవండి: డీఎస్సీ 2008 అభ్యర్థులకు శుభవార్త

Advertisement

తాజా వార్తలు

Prabha News