Sunday, April 28, 2024

తెలంగాణకు నేనే సీఎం!

తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్న వైఎస్ షర్మిల.. పార్టీ ఏర్పాటుపై కసరత్తును ముమ్మరం చేశారు. ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని, తానే సీఎంనని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఇవాళ ఉమ్మడి పది జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో నిర్వహించబోతున్న సభకు సంబంధించిన పోస్టర్ ను ఆమె ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫిబ్రవరి 9 నుంచి తాను ఎంతోమందిని కలిశానని, ప్రతి ఒక్కరూ రాజన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలని కోరుతున్నారని తెలిపారు. ఏప్రిల్ 9న వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించిన రోజని, అందుకే ఆ రోజున బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

రాష్ట్రంలో పరిస్థితుల పట్ల ఎవరూ భయపడాల్సిన పనిలేదని, తానున్నానని షర్మిల భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవని, వైఎస్సార్ పేరు చాలని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ చెబితే వచ్చినవాళ్లం కాదని, బీజేపీ అడిగితే వచ్చినవాళ్లం కాదని అన్నారు. పాదయాత్ర మొదలుపెట్టిన ఏప్రిల్ 9న తొలి అడుగు వేద్దామని షర్మిల అన్నారు.

మరోవైపు ఖమ్మం జిల్లా నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన షర్మిల.. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అట్టహాసంగా అరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది.  ఏప్రిల్ 9న లక్ష మందితో ఖమ్మంలో తలపెట్టిన షర్మిల సభకు కోవిడ్ రూపంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. బహిరంగ సభకు అనుమతులిచ్చిన పోలీసులు.. షరతులు విధించడం చర్చనీయాంశంగా మారింది. లక్ష మందితో సభ నిర్వహణకు షర్మిల బృందం ఒకవైపు కసరత్తు చేస్తుంటే.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం 6 వేల మందితో సభ నిర్వహించుకునేందుకు ఖమ్మం జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలలోపే సభ నిర్వహించుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement