Friday, April 26, 2024

300 అడుగుల లోతులో పడిపోయిన యువకుడు.. కాపాడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్..

కేరళలోని మాలంపుజా ప్రాంతంలో కొండల మధ్యలో చిక్కుకున్న యువకుడిని భారత సైన్యం కాపాడిన ఘటన అంద‌రికీ తెలిసిందే. అయితే సరిగ్గా ఇట్లాంటి ఘటనే కర్నాటకలోని చిక్కబళ్లాపూర్ పరిధిలోనూ జ‌రిగింది. దాదాపు 300కు పైగా అడుగుల లోతులో కొండ అంచున చిక్కుకున్న యువకుడిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది రక్షించారు. ఆదివారం జ‌రిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిశాంక్ అనే 19 ఏళ్ల యువకుడు ఆదివారం త‌న దోస్తుల‌తో క‌లిసి చిక్కబళ్లాపూర్ జిల్లాలోని నంది హిల్స్ ప్రాంతానికి సరదగా ట్రెకింగ్ కి వెళ్లాడు. ఈ క్రమంలో బ్రహ్మగిరి శిలల కొండ శ్రేణులపై యువకులు ట్రెకింగ్ చేస్తుండగా.. నిశాంక్ జారిప‌డ్డాడు.. దీంతో 300 అడుగుల లోతులోకి జారిపోయి అక్క‌డున్న కొండ అంచున చిక్కుకున్నాడు. నిశాంక్ స్నేహితుల ద్వారా సమాచారం అందుకున్న చిక్కబళ్లాపూర్ జిల్లా కలెక్టర్.. స్థానిక పోలీసులతో ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు.

అయితే కొండ నిటారుగా ఉండడంతో యువకుడిని రక్షించేందుకు కష్టతరంగా మారింది. దీంతో కలెక్టర్ యెలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు సమాచారం అందించారు. యువకుడిని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ సందేశంపై స్పందించిన ఎయిర్ ఫోర్స్ అధికారులు.. యువకుడిని రక్షించేందుకు Mi17 హెలికాప్టర్ ను, ప్రథ‌మ చికిత్స సిబ్బందిని పంపించారు. అయితే హెలికాప్టర్ దిగేందుకు కూడా అనువుగాని పక్షంలో.. హెలికాప్టర్ లోనుంచి తీగ డోలిని యువకుడు ఉన్న ప్రదేశానికి జారవిడిచారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సూచనల ప్రకారం.. నిశాంక్ ఆ డోలిని పట్టుకోగా నెమ్మదిగా పైకి లాగారు. హెలికాప్టర్ లోనే ఉన్న ఎయిర్ ఫోర్స్ వైద్య సిబ్బంది నిశాంక్ కు ప్రథ‌మ చికిత్స చేసి అనంతరం యెలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి స్నేహితులను కలుసుకున్న నిశాంక్ ఆస్ప‌త్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. యువకుడు ప్రాణాలతో బయటపడడంతో అటు జిల్లా యంత్రాంగంతో పాటు ఇటు స్నేహితులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement