Sunday, April 28, 2024

తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ గెలుస్తుందా?

దక్షిణ భారతంలో పాగా వేయాలని కమలనాథులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కర్ణాటకలో అధికారంలోకి వచ్చారు. తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకేతో జతకట్టారు. కేరళలో కమ్యూనిస్టుల ఉనికిని తగ్గిస్తున్నారు. తెలంగాణలో చాపకింద నీరులా విజయాలు సాధిస్తున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ పార్టీతో జతకట్టి తమ విజయ ప్రస్థానం ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతున్నారు.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో ఇప్పుడిప్పుడే బీజేపీ బలమైన పునాదులను నిర్మించుకుంటోంది. నాలుగు నెలల క్రితం జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో కమలం పార్టీ ఏకంగా అధికార పార్టీకే షాక్ ఇచ్చింది. ఈ గెలుపు బీజేపీ నేతలకు మంచి బూస్ట్ ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఊపులోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ దాదాపు గెలిచినంత పనిచేసింది. అధికార పార్టీకి మళ్లీ ముచ్చెమటలు పట్టించింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. అయితే దీనికి బీజం ‘దుబ్బాక’లోనే పడిందని రాజకీయ విశ్లేషకుల మాట.

ఇక ఏపీ విషయానికి వస్తే మరో రెండు వారాల్లో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జనసేనతో పొత్తు ఉన్నా కానీ బీజేపీనే తిరుపతిలో తమ అభ్యర్థిని నిలబెట్టింది. మాజీ ఐఏఎస్ రత్నప్రభను బరిలోకి దించింది. ఇప్పటికే తిరుపతిలో ఒకసారి బీజేపీ విజయం సాధించింది. 1999 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వెంకటస్వామి తిరుపతి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు ఉంది. దుబ్బాకలో విజయం సాధించినప్పుడే కమలనాథులు తిరుపతి ఉపఎన్నికపై కన్నేసి పలు కామెంట్లు కూడా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తిరుపతి ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకునే ‘భగవద్గీత పార్టీ కావాలో.. బైబిల్ పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోండి’ అంటూ అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసి నిప్పు రాజేశారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బండి సంజయ్ తిరుపతిలో ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి బండి సంజయ్ చేసిన ప్రచారం, ఆయన వ్యాఖ్యలే కారణమని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు ఏపీ బీజేపీ నేతలే అంటున్నారు. దీంతో ఢిల్లీ పెద్దలు బండి సంజయ్‌ ఈనెల 14న తిరుపతిలో ప్రచారం చేయాలని చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి.

తిరుపతి ఉపఎన్నికలో రత్నప్రభను గెలిపించడానికి ఉన్న అన్ని అవకాశాలను కమలనాథులు వాడుకుంటున్నారు. తిరుపతి హిందువుల ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మం, రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు తదితర అంశాలను బీజేపీ తెరపైకి తీసుకొస్తోంది. ఎలాగైనా తిరుపతి ఉపఎన్నికలో గెలిచి ఏపీలో అధికారం దిశగా ముందడుగు వేయాలని బీజేపీ భావిస్తోంది. ఒకవేళ తిరుపతిలో బీజేపీ గెలిస్తే భవిష్యత్‌లో ఏపీలో పలు ఉపఎన్నికలు జరిగే అవకాశాలు ఉండటంతో ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చినట్లు అవుతుంది. వైసీపీ కూడా బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టడం బీజేపీ గెలుపు అవకాశాలను పెంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి కూడా తిరుపతి అంత బలం లేదని లెక్కలు వేస్తున్నారు. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా త్వరలో బీజేపీ అభ్యర్థి తరఫున తిరుపతిలో ప్రచారం చేయబోతున్నారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ యోగి ఆదిత్యనాథ్‌ను కూడా బీజేపీ రంగంలోకి దింపే అవకాశముందని తెలుస్తోంది.

బీజేపీకి తెలంగాణలోని దుబ్బాక తరహాలో ఏపీలోని తిరుపతి విజయప్రస్థానంగా మారుతుందా అంటే పూర్తిగా చెప్పలేమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరేళ్లు దాటింది. అక్కడ కేసీఆర్ సర్కారుపై కొంత వ్యతిరేకత ఉండటంతో పాటు.. పొరుగున ఉన్న సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేట నియోజకవర్గాలతో పోలిస్తే.. తమ నియోజకవర్గం వెనుకబడిందనే భావన దుబ్బాక ప్రజల్లో ఉంది. అదీగాక అక్కడ బీజేపీకి రఘునందన్ రావు రూపంలో బలమైన అభ్యర్థి ఉన్నాడు. గత ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఆయనపై కొంత సానుభూతి ఉంది. కానీ తిరుపతి విషయానికి వస్తే జగన్ అధికారంలోకి వచ్చి ఎంతో కాలం కాలేదు. అదీగాక సంక్షేమ పథకాలు, సిట్టింగ్ ఎంపీ మరణంతో సానుభూతి ఎలాగో ఉండనే ఉన్నాయి. గత రెండు పర్యాయాలు ఇక్కడ వైఎస్సార్సీపీ గెలుపొందింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ పార్టీ అభ్యర్థిపై బీజేపీ-జనసేన విజయం సాధిస్తే.. ఏపీ రాజకీయాల్లో అది పెనుమార్పుగానే భావించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement