Monday, May 13, 2024

లబ్ధిదారులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఎందుకు ఇవ్వట్లేదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం, కేటాయింపులపై తాజా నివేదికను అందజేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాజాపా నేత నల్లు ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ, అభినంద్‌కుమార్‌ షాబిల్లితో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. రూ.10వేల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణలో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించినప్పటికీ ఇందులో కేవలం 12వేల ఇళ్లను మాత్రమే కేటాయించారని ఇంద్రసేనారెడ్డి తరుపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ రాజకీయ కారణాలతో వాటిని లబ్దిదారులకు కేటాయించడం లేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు.

డబల్‌ బెడ్‌ రూం ఇళ్లు లబ్దిదారులకు ఎందుకు కేటాయించడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కొన్ని ఇళ్ల కేటాయింపు పూర్తయిందని, మిగతా వాటిని వీలైనంత త్వరగా లబ్దిదారులకు ఇస్తామని ప్రభుత్వం తరుపు న్యాయవాది వివరించారు. ఇప్పటి వరకు ఎన్ని నిర్మించారు..?, లబ్దిదారులకు ఎన్ని కేటాయించారో పూర్తి వివరాలతో రెండు మాసాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement