Sunday, April 28, 2024

Big Story: డ్రగ్స్‌ సూత్రధారి, పాత్రధారి లక్ష్మీపతి ఎక్కడ? నార్కోటిక్‌ పోలీసుల గాలింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మాదక ద్రవ్యాల ముఠాలు రెచ్చిపోతున్నాయి. మహానగరం హైదరాబాద్‌లో పోలీసులు, నార్కోటిక్‌ విభాగం అధికారుల కళ్లుగప్పి డ్రగ్స్‌ తయారీ, రవాణా, పంపిణీ యథేచ్ఛగా సాగుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్‌ రక్కసికి యువత బానిసలవుతున్నారు. డ్రగ్స్‌ పెడలర్స్‌ (ముఠా) ఎంపిక చేసుకున్న యువతను నేరుగా గోవాకు తీసుకువెళ్లి డ్రగ్స్‌ మత్తులో దింపుతుండగా మరికొందరు బయట నుంచి మాదక ద్రవ్యాలను తీసుకువస్తూ ఇక్కడి యువతకు విక్రయించి వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యవహారం చాలదన్నట్టుగా ఓ యువకుడు ఒక అడుగు ముందుకేసి ఇంట్లోనే డ్రగ్స్‌ తయారు చేసే ల్యాబ్‌ను ఏర్పాటు చేసి తద్వారా తన వ్యాపారాన్ని విస్తృతపరిచే పనిలో నిమగ్నమయ్యాడు. ఎక్కువ మోతాదు డ్రగ్స్‌ను తీసుకుని ప్రాణాలు కోల్పోయిన ఇంజనీరింగ్‌ విద్యార్థి ఘటనతో హైదరాబాద్‌ నగరంలోని మూడు పోలీస్‌ కమిషరేట్ల అధికారులు, యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. డ్రగ్స్‌ను నిరోధించేందుకు ఏర్పాటైన నార్కోటిక్‌ విభాగం అధికారులు నిందితులను వెంటాడి వేటాడేందుకు రంగంలోకి దిగారు.

గోవా నగరం మాదక ద్రవ్యాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. హైదరాబాద్‌ నగరానికి ఐటీ ఉద్యోగులు, ఇంజనీర్లు, వృత్తి విద్యా కోర్సులను చదువుతున్న విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగిస్తున్నట్టు సమాచారం. డ్రగ్స్‌కు బానిసైన బీటెక్‌ విద్యార్థి నిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోవడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితం నగరంలో డ్రగ్స్‌ను వినియోగిస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఇందులో నల్లకుంట పరిధిలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ప్రేమ్‌ ఉపాధ్యాయతో పాటు వాటిని వినియోగిస్తున్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విచారించగా అసలు సంగతి బయట పడింది. వీళ్లంతా గోవా వెళ్లి డ్రగ్స్‌ సేకరిస్తున్నట్టు వాంగ్మూలం ఇచ్చారు. జూబ్లిdహిల్స్‌ పరిధిలో ఉంటున్న శ్రీరాం, అతని వద్ద డ్రగ్స్‌ వినియోగిస్తున్న దీపక్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తాము తరచూ గోవా వెళుతుంటామని, అక్కడ ఏర్పాటు చేసిన ఒక అతిథి గృహంలో బస చేసి వారం, పది రోజులపాటు ఉంటూ డ్రగ్స్‌ను వినియోగిస్తున్నట్టు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక వ్యక్తి అయిన లక్ష్మీపతిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. పరారీలో ఉన్న లక్ష్మీపతి కోసం నార్కోటిక్‌ పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. లక్ష్మీపతిపై ఉన్న పాత కేసుల చిట్టాలను తొవ్వుతున్నారు. అతని నెట్‌వర్క్‌, కాంటాక్టులో ఉన్న విద్యార్థులపై దృష్టి సారించారు. గోవా నుంచి డ్రగ్స్‌ను, విశాఖపట్నం నుంచి హష్‌ ఆయిల్‌ తెచ్చి హైదరాబాద్‌లో లక్ష్మీపతి విక్రయిస్తున్నట్టు నార్కోటిక్‌ విభాగం గుర్తించింది. డ్రగ్స్‌ బాధితులను గుర్తించే పనిలో పడ్డ పోలీసులు గోవా వెళ్లి వస్తున్న వారిపై నిఘాను పెట్టింది.

గతంలో గోవా వెళ్లిన వారి వివరాలను సేకరిస్తోంది. రైళ్లు, బస్సులు, విమానాల ద్వారా గోవాకు వెళ్లిన ప్రయాణికుల వివరాలు, వారు టికెట్‌ ఎక్కడ కొనుగోలు చేసింది, ఆ సమయంలో వారిచ్చిన మొబైల్‌ ఫోన్‌ నెంబర్లను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేస్తే ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఏ విధంగా టికెట్‌ ఛార్జీని చెల్లించారు అనే అంశంపై పోలీసులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లాకు చెందిన శ్రీరాం జూబ్లిdహిల్స్‌లో ఉంటూ ఇంట్లోనే మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించి ఆయనను అరెస్టు చేశారు. ఇంటర్నెట్‌ ద్వారా డ్రగ్స్‌ ఎలా తయారు చేయాలన్న అంశంపై కసరత్తు చేసి శ్రీరాం ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. హిమాలయాలు, రుషికేశ్‌ లాంటి ప్రాంతాలకు వెళ్లి విదేశీ పర్యాటకులను కలిసి డీఎంటీ తయారీ విధానాన్ని శ్రీరాం నేర్చుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే తొలుత తనతో పాటు తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరు మిత్రులపై తాను తయారు చేసిన డ్రగ్స్‌ను ప్రయోగించాడని ఒక గ్రాము డ్రగ్స్‌ 20 మందికి ఇవ్వవచ్చన్న విషయం తెలిసి అప్పటి నుంచి ఇదే వ్యాపారాన్ని వృత్తిగా మార్చుకుని ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్టు పోలీసులు జరిపిన విచారణలో వెల్లడైంది.

డ్రగ్స్‌ నుంచి బయట పడేలా…
మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్న విద్యార్థులు, యువకులను ఆ మురికికూపం నుంచి బయట పడేసేందుకు పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. నల్లకుంట పోలీసుల అదుపులో మరో ముగ్గురు డ్రగ్స్‌ వినియోగిస్తున్న విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. వీరిని విచారిస్తుండగా ఎన్నో విషయాలు వెలుగు చూశాయని, త్వరలోనే డ్రగ్స్‌ ముఠాను చేదిస్తామన్న ధీమాను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలవుతున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం రంగంలోకి దిగింది. నిందితుల మొబైల్‌ ఫోన్‌ డేటా ఆధారంగా సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. గోవా కేంద్రంగా మొత్తం డ్రగ్స్‌ రాకెట్‌ నడిచినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు బీటెక్‌ విద్యార్థులతో పాటు మరో నలుగురు డీజీలు కలిసి గోవాలో డ్రగ్స్‌ పార్టీలో నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. తొమ్మిదికి గోవాలో ఒక హోటల్‌తో పాటు రిసార్ట్స్‌లో డ్రగ్స్‌ను అందించారు. ఎవరికి అనుమానం రాకుండా టాటూస్‌ వేసుకుని అటువంటి వారికి మాత్రమే డ్రగ్స్‌ సప్లయ్‌ చేసేలా వ్యూహం రచించినట్టు సమాచారం. హైదరాబాద్‌ నుండి వెళ్లే వారికి డ్రగ్స్‌ అందించేందుకు గోవాలో 15 ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేశారని, ఇందులో నిరంతరం డ్రగ్స్‌ సప్లయ్‌ జరుగుతుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement