Monday, May 6, 2024

గిదేందిరా అయ్యా.. సీజన్​ చివరలో యూరియా ఏం జేస్కుంటరు!

యాసంగి సీజన్​ ప్రారంభంలో రావాల్సిన యూరియా బస్తాలు ఇప్పొడొచ్చినయట.. సీజన్​ అంతా అయిపోయినంక అవేం జేస్కోవాలే అని రైతులు సీరియస్​ అవుతున్నరు. అప్పట్ల కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగితే ఇయ్యాల, రేపు అంటూ తిప్పుకున్నరు. కానీ, ఒక్క బస్త కూడా ఇయ్యలే.. దాంతోటి ప్రైవేటు షాపుల కాడ ఎక్కువ ధరపెట్టి రైతులు యూరియా, ఇతర ఎరువులు కొనుగోలు చేసిన్రు.. కానీ, అంతా అయిపోయి పంట చేతికొచ్చే టైముకు యూరియా లోడు వచ్చింది.. దాన్ని ఇప్పుడేం జేస్కోవాలే అంటున్నరు రైతులు.. ఇగో గిట్లుంది సహకార సంఘాల ముచ్చట..

రేగోడ్‌, ప్రభ న్యూస్‌ : యాసంగి సీజన్‌ వచ్చిందంటే రైతులు ముమ్మరంగా వ్యవసాయ పనుల్లో లీనమవుతారు. అన్ని విధాలుగా వ్యవసాయానికి కావాల్సిన సామగ్రిని అందుబాటులో ఉంచుకుంటారు. ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై అందే ఎరువులు, విత్తనాలపై కొండంత ఆశలు పెట్టుకుని సహకార సంఘం కార్యాలయాలు వెళితే.. నో స్టాక్‌ అంటూ సమాదానం తప్ప.. మరో ముచ్చట లేకపాయే.. ఇప్పుడు వస్తాయి.. అప్పుడు వస్తాయి.. అంటూ దాటవేసే దోరణి తప్పా.. యూరియా బస్తాలు వచ్చేదీ లేదు.. సచ్చేది లేదు అన్న చందంగా తయారైంది రేగోడ్‌ సహకార సంఘం పని తీరు. కాళ్లరిగేలా కార్యాలయం చుట్టూ తిరిగినా సబ్సిడీపై రావాల్సిన వ్యవసాయ సామగ్రి రైతులకు అందలేదు.. ఇక చేసేదేమీ లేక రైతులు ప్రైవేట్‌ ఫర్టిలైజర్‌ షాపుల్లో యూరియా, ఇతర సామాగ్రిని అధిక ధరలను సైతం లెక్కచేయకుండా కొనుగోలు చేశారు.

ఇంత జరుగుతున్నా సహకార సంఘం చైర్మన్‌ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారుల అండదండలతో తాను ఆడిందే ఆట పాడిందే పాటగా.. రేగోడ్‌ సహకార సంఘానికి రావాల్సిన వ్యవసాయ సామాగ్రి తెప్పించే విషయంలో భారీగానే నిర్లక్ష్యం వహించారు. అయితే దీనంతటీకి కారణం ఏమిటని అడిగిన అధికారులకు ముడుపులు ముట్టజెబుతూ.. వారి నోటికి తాళం వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అధికారులు సైతం అందినకాడికి దండుకుంటూ మిన్నకుండి పోయారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

ఆలస్యంగా యూరియా.. టూ లేట్‌ సారూ..
యాసంగి ప్రారంభమైన నెలలు గడుస్తున్నాయి. సహకార సంఘం చైర్మన్‌ యాసంగి ప్రారంభంలోనే తమకు కావాల్సిన స్టాక్‌కు సంబంధించి వ్యవసాయ అధికారులకు ఇండెంట్‌ ఇచ్చి తెప్పించుకోవాలి. అధికారులకు ఇండెంట్‌ పంపించడం విషయంలో చైర్మన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇదే విషయం ఆంధ్రప్రభ దృష్టికి రావడంతో రైతుల పక్షాణ అక్షర పోరాటం చేసింది. మొదట్లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన చైర్మన్‌.. నిర్లక్ష్యంగాపై వరుస కథనాలు రాయడంతో ఉన్నతాధికారుల ఒత్తిడితో యూరియా బస్తాలు, ఇతర సామగ్రి కావాలని వ్యవసాయ అధికారులను మూడు రోజుల క్రితమే ఇండెంట్‌ పంపినట్లు సమాచారం.

అయితే మార్చి 1 శివరాత్రి పండుగ ఉన్నప్పటికీ ఈ చర్చ జిల్లా స్థాయి అధికారుల దృష్టికి వెళుతుందనే భయంతో మండల సహకార సంఘం అధికారుల, వ్యవసాయ అధికారులు హుటాహుటిన శివరాత్రి సెలవు దినం అయినప్పటికీ లారీ లోడ్‌ యూరియాను రేగోడ్‌ సహకార సంఘానికి పంపించారు. ఇప్పటికే దాదాపు వేలాది ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. వాటికి కావాల్సిన విత్తనాలు, యూరియాను రైతులు ప్రైవేట్‌ ఫర్టిలైజర్‌ షాపుల్లో కొనుగోలు చేశారు. అయితే రైతులు ఇప్పటికే యూరియా బస్తాలను అధిక ధరలకు కొనుగోలు చేశామని తాము ఆర్థికంగా నష్టపోయామని వాపోతున్నారు. యాసంగి ప్రారంభంలోనే ప్రభుత్వం ద్వారా మాకు సబ్సిడీపై అందాల్సిన యూరియా, ఇతర ఎరువులు, సామాగ్రిని అందిస్తే తమకు రూ.7-10 వేల వరకు కలిసొచ్చేదని రైతులు అంటున్నారు. దొంగలు పడ్డ ఆరేళ్లకు కుక్కలు మొగిరిన చందంగా సహకార సంఘం, వ్యవసాయ అధికారుల పనితీరు ఉందని రైతులు బహిరంగంగానే అంటున్నారు.

తప్పు ఎవరిది..
సహకార సంఘం నుంచి యాసంగికి సంబంధించిన ఎరువు బస్తాల కోసం వ్యవసాయ అధికారులకు సహకార సంఘం చైర్మన్‌ ఇండెంట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని పరిశీలించి వ్యవసాయాధికారులు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సహకార సంఘాలకు ఎరువులు, విత్తనాలు ప్రభుత్వం ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటారు. అయితే ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులకు సహకార సంఘం చైర్మన్‌ నుంచి ఇండెంట్‌ ఇవ్వలేదు. ఆంధ్ర ప్రభలో వస్తున్న కథనాలకు స్పందించి మూడు రోజుల క్రింతం వ్యవసాయ అధికారులకు ఇండెంట్‌ పంపించినట్లు సమాచారం. ఏది ఏమైనా సహకార సంఘం చైర్మన్‌, వ్యవసాయ అధికారులు చేసిన తప్పిదం వల్లే ఈ రోజు రైతులు ఆర్థికంగా నష్టపోయారన్నది జగమెరిగిన సత్యం..

తనిఖీలు లేకపోవడం వల్లనే..
సహకార సంఘం ద్వారా రైతులకు అందిస్తున్న ఎరువులు, విత్తనాలు ఇతర సామాగ్రి ఎప్పటికప్పుడు రైతులు అందుతున్నాయా? లేదా? అనే విషయమై అధికారులు ఆడిట్‌ నిర్వహించాలి. ఒక వేళ సహకార సంఘంలో ఏమైనా అక్రమాలు, ఎరువులు, యూరియా పక్కదారి పడితే సంబంధిత నివేదికను జిల్లా స్థాయి అధికారులకు పంపి సహకార సంఘం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు అధికారులు చైర్మన్‌ సాబ్‌ అందించే మామూళ్లకు అలవాటు పడి తనిఖీలకు దూరంగా ఉంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని రైతులు కోరుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించి రేగోడ్‌ మండంలోని రైతులు ఆర్థికంగా నష్టపోకుండా సమయానికి వ్యవసాయ సామగ్రి అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement