Friday, May 17, 2024

ఎస్సీ రిజ‌ర్వేష‌న్ల వ‌ర్గీక‌ర‌ణ పోరు.. అమ‌రుల‌ ఆశ‌యాలు సాధిస్తాం: మంద కృష్ణ మాదిగ

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన అమరుల ఆశయాల సాధన వైపే మాదిగ దండోరా ఉద్యమ ప్రయాణం కొనసాగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మార్చి 01 మాదిగ అమరవీరుల రోజు సందర్భంగా హన్మకొండలో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. అమరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంద ఆయ‌న మాట్లాడుతూ “చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన పాలక పార్టీలు చేసిన ద్రోహం వల్లే మాదిగ బిడ్డలు పోరాటంలో నెలకొరిగారని అన్నారు. దేశంలో న్యాయమైన సమస్య పరిష్కారం కోసం ప్రాణ త్యాగాలు చేసే స్థితి రావడానికి రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవడమే ప్రధాన కారణం. సమాజం యావత్తు ఎస్సీ వర్గీకరణ న్యాయమని మద్దతు పలుకుతున్న పాలక పార్టీలు మాత్రం వర్గీకరణను చట్టబద్ధం చేయడం లేదు. మాదిగలకు రిజర్వేషన్లు అందక పోవడం వల్లే దశాబ్దాల తరబడి విద్యా ఉద్యోగ రంగాల్లో తీవ్రంగా వెనుకబడి పోయారు. కాబట్టే మాదిగల ఆవేదనలో నుండి దండోరా ఉద్యమం పుట్టింది. ఆ ఆవేదన పాలకుల మోసాల వల్ల ఆగ్రహంగా మారింది. ఆ ఆగ్రహ పోరాట జ్వాలల్లో పాలకుల మీద తిరగబడి కొంత మంది యువకిశోరాలు ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మోసం వల్ల, కేసీఆర్ ప్రభుత్వం చేసిన దాడి వల్ల భారతి మాదిగ ప్రాణాలు కోల్పోయింది. భారతి మాదిగను బలితీసుకున్న కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికి వర్గీకరణ ఆకాంక్షను నెరవేర్చలేదు. కేసీఆర్ కు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి వద్దకు వెళ్లి పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టించాలి అని మంద‌కృష్ణ‌ డిమాండ్ చేశారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణను బలపరుస్తున్నందున బీజేపీ ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలన్నారు. వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానని బీజేపీ కల్లబొల్లి మాటలు చెప్పి మాదిగలను మోసం చేసిందన్నారు. అయినా కూడా సుదీర్ఘ ఉద్యమంలో మనోధైర్యం కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో మాదిగ అమరుల స్వప్నం సాకారం చేయడానికి పోరాటం ముందుకు సాగుతుందని అన్నారు.

కార్యక్రమంలో MRPS నేతలు మంద కుమార్ మాదిగ, వేల్పుల సూరన్న బొడ్డు దయాకర్, పుట్ట రవి మాదిగ, మంద రాజు మాదిగ, బండారు సురేందర్, బిర్రు మహేందర్ మాదిగ, జన్ను దినేష్,విజయ్,ఈర్ల కుమార్ మాదిగ,విజయరావు MSF నేతలు బుర్రి సతీష్ మాదిగ, గద్దల సుకుమార్ మాదిగ, మంద భాస్కర్, వడ్డేపల్లి మధుకర్ మాదిగ,జన్ను మధుకర్, ప్రభుదేవా,వర్ధన్, కిరణ్ శ్రవణ్,ప్రణయ్ ,మంద చిన్న రాజు, కిరణ్,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement