Wednesday, May 1, 2024

Big Story | కలిసొస్తున్న వరంగల్‌ సెంటిమెంట్‌.. ఈనెల 16 తర్వాత సీఎం కేసీఆర్‌ వరుస టూర్లు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వైరల్‌ ఫీవర్‌ నుంచి ఉపశమనం లభించడంతో రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. తొలుత ఈ నెల 16న వరంగల్‌లో ఎన్నికల శంఖారావం పూరించనున్న ఆయన ఆ తర్వాత వరుస ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. పూర్తిస్థాయిలో అభ్యర్ధులను ప్రకటించి అన్ని నియోజకవర్గాలను చుట్టేలా ప్రణాళిక ఖరారు చేస్తున్నారని సమాచారం. అయితే వరంగల్‌నుంచి సభలు మొదలుపెట్టి రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు బీఆర్‌ఎస్‌కు సెంటిమెంట్‌ ఉన్నది. బీఆర్‌ఎస్‌ పార్టీ వరంగల్‌లో ఎప్పుడు సభ నిర్వహించినా భారీగా సక్సెస్‌ అవుతుంది. సీఎం కేసీఆర్‌కు కూడా వరంగల్‌ ఒక సెంటిమెంట్‌ కావడంతో.. అక్కడే మేనిఫెస్టోను ప్రకటించాలని భావిస్తున్నారు.

అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తూ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఈ నెల 16న వరంగల్‌ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తెలంగాణ ఎన్నికలకు ఆ సభలోనే సమర శంఖారావం పూరించనున్నారు. అప్పటిలోగా ఎన్నికల షెడ్యూల్‌ కూడా వచ్చే అవకాశం ఉండటంతో.. వరంగల్‌ సభ పూర్తిగా పార్టీ కార్యక్రమంగా సాగనున్నది. ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన తాజా ఓటర్ల తుది జాబితాలో మహిళా ఓటర్లే 76 నియోజకవర్గాల్లో మెజార్టీలో ఉన్నారు. ఆయా నియోజకవర్గాలలో గతంలో కూడా మహిళా ఓటింగ్‌ శాతమే ఎక్కువగా నమోదైంది. దీంతో వారిని ఆకట్టుకుంటే తప్పకుండా గెలుపు సాధ్యం అవుతుందని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు.

ఇప్పటికే అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత ఉన్నది. దీనికి తోడుగా మహిళలే లక్ష్యంగా భారీ పథకాలు ప్రకటించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. పలు రాష్ట్రాల్ల్రో మహిళల కోసం అమలు అవుతున్న పథకాలను ఇప్పటికే అధ్యయనం చేయించారు. అక్కడి కంటే మరింత మెరుగ్గా ఎలా అమలు చేయాలనే విషయాలపై నిపుణులు, సీనియర్‌ నేతలతో ప్రగతి భవన్‌లో గత కొంత కాలంగా చర్చలు జరిపారు. ఈ సారి బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిపోయేలా ఉండనుందని, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టు-కునేలా పథకాలు ఉంటాయని ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది. దసరా కానుకగా మేనిఫెస్టోను ప్రకటిస్తారని.. ఆ తర్వాత ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ పరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలుస్తున్నది.

- Advertisement -

కాగా ఇప్పటికే కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలకు భారీగా వ్యయం కానుంది. ఈ పార్టీ ప్రజలకిచ్చిన హామీల ఖర్చు రూ. 80వేల కోట్లపైమాటే. అమలులో ఉన్న పథకాలతో కలిపితే ఇది లక్షన్నర కోట్లకు చేరనుంది. ప్రభుత్వ రాబడి రూ. లక్ష కోట్ల లోపే ఆదాయం వార్షికంగా వస్తున్నది. వార్షిక రాబడి పెరుగుదల రూ. 8వేల కోట్లనుంచి రూ. 10వేల కోట్లే ఉంటోంది. మరోవైపు అప్పులు భారీగా పెరిగాయని ఇప్పటికే విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వడ్డీలు, అసలు చెల్లింపులకు రూ. 22వేల కోట్లు వెచ్చిస్తున్నారు. ఇలా అయితే హామీల అమలు ఎలా…రాబడి ఆర్జన ఎలా…? ఇదే ప్రస్తుతం అధికారులను వేదిస్తున్న సమస్య. దీన్నుంచి బైటపడే మార్గం ఏంటని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

ప్రధాన పార్టీలు రెండూ ఇచ్చిన హామీలు, కొత్తగా ప్రకటించే పథకాలను ఎలా నెరవేర్చాలని ఇప్పటినుంచే ప్రభుత్వ పెద్దలు మధనపడుతున్నారు. రాష్ట్రంలో కొత్త ఏడాదిలో ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రస్తుతం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి వస్తుంది. పాత పథకాలను కొనసాగించాల్సి రానుంది. అయితే వాటికి నిధులను సమీకరించడం ఇప్పుడు కత్తిమీద సాముగా మారింది. అధికారంలోకి వచ్చాక హామీలను పెడచెవిన పెడితే ప్రజలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బుద్దిచెబుతారని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో అధికారం చేపట్టగానే హామీల అమలుపై అధికారులను ఉరుకులు పెట్టిస్తారని ముందే ఊహించిన అధికారగణం అంచనాలను సిద్దం చేస్తున్నది.

ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిశాంతికుమారి, సీనియర్‌ ఐఏఎస్‌, ఆర్ధిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రామకృష్ణారావులు శాఖలవారీగా ఆదాయ వివరాలను, పథకాల వ్యయాలను తెలుసుకున్నారు. ఆర్ధిక, ప్రణాళిక, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, వాణిజ్య పన్నులు, ఆబ్కారీ శాఖలనుంచి పూర్తి సమాచారం కోరి వాటిపై లెక్కలు వేస్తున్నారు. ప్రధానపార్టీలు చెప్పిన మేరకు హామీల అమలుకు ఏటా రూ. 50 వేల కోట్లు అదనంగా అవసరమని అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఒకవేళ ఏపార్టీ నిరుద్యోగ భృతి ప్రకటించినా ఇందుకు రూ. 3600కోట్లకుపైగా అవసరం కానున్నాయి. గృహలక్ష్మి ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వారికి కుటుంబానికి రూ. 3లక్షల చొప్పున రూ. 18వేల కోట్లు అవసరం కానుంది. ఇక ఏడాదికి 6 ఉచిత సిలిండర్‌ల ఖర్చు కూడా దాదాపు రూ. 3వేల కోట్లకు మించనుంది.

పీఆర్సీ పెరిగితే జీతాలు, పింఛన్ల ఖర్చు ఏటా రూ. 35వేల కోట్లకు పెరగనుంది. వేతన సవరణద్వారా ఒక్క శాతం పెరిగినా రూ. 300కోట్లు, 15 శాతంగా పెంచితే రూ. 4500కోట్లు అదనపు భారం కానుంది. మొత్తంగా జీతాలకు రూ 35వెల కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి రానుంది. ఇక రైతుబంధుకు ఎకరాకు రూ. 10వేలు కాస్తా రూ. 12వేలకు పెరిగితే ఏటా రూ. 36వేలకుపైగా వ్యయం కానుంది. ఉచిత విద్యుత్‌కు రూ. 12వేల కోట్లు, ఆరోగ్య శ్రీ, హెల్త్‌ స్కీంలకు రూ. 5500కోట్లు సబ్సిడీ బియ్యానికి రూ. 4వేల కోట్లు ఖర్చు కానుంది. ఉచిత అల్పాహార పథకానికి కూడా భారీగా వ్యయం కానుంది. ఇక కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు కష్టసాధ్యమేనని ఆర్ధిక వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే లోటు..ఆపై ఎలా…
రాష్ట్రంలో పార్టీలన్నీ ఇప్పుడు నిరుద్యోగ భృతి, సామాజిక పించన్లు, రుణమాఫీవంటి వాటిపై హామీలిస్తున్నాయి. అయితే బడ్జెట్‌లో ఉన్న నిధులు, రాష్ట్ర ఆదాయంలో సింహభాగం ఈ మూడు నాలుగు పథకాలకు ఖర్చుకానున్నాయి. నిరుద్యోగ భృతికి దాదాపు రూ. 5428కోట్లు, పించన్లకు రూ. 10వేలకోట్లు రైతు రుణమాఫీ, పించన్లు, నిరుద్యోగ భృతివంటి వాటికే దాదాపు రూ. 50వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. అయితే ప్రధానపార్టీలు ప్రస్తావిస్తున్న పథకాలు, ప్రాజెక్టులకు వ్యయాలు, జీతాలు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్లు, రైతుబందు, రైతు బీమా, ఇతర బడ్జెటేతర ఖర్చులకు ఏటా రూ. 1.50లక్షల కోట్లు అవసరం కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement