Tuesday, May 7, 2024

తెలంగాణకు 6 లక్షలు.. ఏపీకి 2 లక్షల టీకాలు

కరోనా మహమ్మారి వ్యాప్తికి నిరోధించాలంటే టీకా ఒక్కటే సరైన మార్గమని, ప్రతి ఒక్కళ్లూ వ్యాక్సిన్ వేయించుకోడానికి ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి టీకా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టీకాల పంపిణీ జోరుగా సాగుతోంది. అయితే, ఇరు  రాష్ట్రాల్లో టీకాల కొరత ఏర్పడింది. టీకా డోస్‌లు తక్కువ సంఖ్యలో ఉండటంతో తమ రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో పంపాలని పలు ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు రాశాయి. దీంతో కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు టీకాలు సరఫరా చేసింది.

పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి 2 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‌ ను అధికారులు తరలించారు. గన్నవరం టీకా కేంద్రం నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో వ్యాక్సిన్ డోసులు జిల్లాలకు తరలివెళ్లనున్నాయి.

మరోవైపు తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ నిల్వలు  తగ్గిపోవడంతో అనేక జిల్లాల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు.  రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ కావాలని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో బుధవారం రాష్ట్రానికి 6 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 7.5 లక్షల డోసులు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  కొత్తగా వచ్చిన 6 లక్షల డోసులను అవసరమైన జిల్లాలకు ప్రభుత్వం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement