Friday, May 17, 2024

జూలై చివరి నాటికి రోజుకు కోటి టీకాలు పంపిణీ: ఎయిమ్స్‌ చీఫ్‌

దేశంలో జూలై చివరి నాటికి రోజు కోటి డోసులు వ్యాక్సిన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భావిస్తోందని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భారత్‌ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే దేశంలో టీకాల ఉత్పత్తిని పెంచాలన్నారు. అలాగే వ్యూహాత్మకంగా విదేశాల నుంచి వీలైనన్ని వ్యాక్సిన్లు తెప్పించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే చర్చలు జరిపేందుకు వారు సుముఖంగా ఉన్నట్లు గులేరియా గుర్తుచేశారు.

టీకాలను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేయాలన్నారు. వ్యాక్సిన్ సేకరణకు ఖచ్చితమైన వ్యూహంతో ముందుకెళ్లాలని సూచించారు. పలువురితో కాకుండా ఒక్కరితోనే చర్చలు జరిపేందుకు తయారీదారులు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఢిల్లీ, పంజాబ్‌తోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లను నెరవేర్చేందుకు ఔషధ కంపెనీలు నిరాకరించిన నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గర్భిణులకు సైతం టీకాలు వేయాలని సూచించారు. గర్భిణుల్లో అనారోగ్య సమస్యలతోపాటు మరణాల రేటు అధికంగా ఉందని, ఈ మేరకు వారికి త్వరగా వ్యాక్సిన్ వేయాలన్నారు. కొవాగ్జిన్‌ టీకా అయితే గర్భిణులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. మల్టీ విటమిన్లు, జింక్ సప్లిమెంట్స్ వంటి రోగనిరోధక శక్తి బూస్టర్ల వాడకంపై స్పందిస్తూ.. అవి ఎలాంటి హాని చేయవన్నారు. కానీ, వాటిని ఎక్కువ కాలం తీసుకోకూడదని హెచ్చరించారు. బదులుగా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, సహజ వనరుల నుంచి విటమిన్లు పొందాలని సూచించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement