Sunday, April 28, 2024

Russia-Ukraine crisis: తూర్పు ఉక్రెయిన్ లో కాల్పుల మోత

ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతంలోని కాడివ్కాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. రష్యా మద్దతున్న వేర్పాటువాదులు, ఉక్రెయిన్‌ సైనికుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ ఘటనలో ప్రాణనష్టం లేనప్పటికీ ఇద్దరు పౌరులకు గాయాలైనట్లు సమాచారం. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పట్ల ఇరు దేశాలూ ఒకరిపై ఒకటి ఆరోపణలు మొదలుపెట్టాయి. సరిహద్దు ప్రాంతంలో గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో వేర్పాటువాదులే కాల్పులకు పాల్పడినట్టు ఉక్రెయిన్‌ సైన్యం వెల్లడించింది. మరోవైపు, ప్రభుత్వ బలగాలే తమపై కాల్పులు జరిపినట్లు వేర్పాటువాదులు ఆరోపించారు.

గత 24 గంటల్లో నాలుగుసార్లు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. సరిహద్దుల్లో సైన్యం మోహరించిన తరుణంలో రెచ్చగొట్టే చర్యల్లో భాగంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌ ఆక్రమణకు ఓ కారణాన్ని చూపి, ఆ ప్రాంతంలో మారణహోమం సృష్టించేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను ఖండించిన రష్యా.. సరిహద్దుల్లో మోహరించిన తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుంటున్నామని పేర్కొంది. కాగా, తూర్పు ప్రాంతంలో యుద్ధ ట్యాంకులు, ఫిరంగులతో కాల్పులకు పాల్పడినట్టు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement