Sunday, April 28, 2024

గులాబీ కండువా కప్పుకోనున్న ఎల్.రమణ

తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధమైందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీ.పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత హుజురాబాద్ పోరుపై దృష్టి సారించారు. మరోవైపు బీజేపీ తరుపున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. ఇక, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో షర్మిల ఏంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ కు గెలవడం అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్.. సామాజిక సమీకరణలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో బీసీ వర్గానికి చెందిన తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణకు పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు.

టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ గులాబీ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. గురువారం ప్రగతి భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రమణ సమావేశం కానున్నారు. ఈ భేటీ తరువాత ఆయన టీఆర్ఎస్‌లో ఎప్పుడు చేరుతారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

గత కొంత కాలంగా రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీకి పెద్దగా బలం లేకపోయినా చాలా చోట్ల ఆపార్టీకి క్యాడర్ మాత్రం ఇంకా ఉంది. రాజకీయాల్లో చాలా సీనియర్ అయిన ఎల్.రమణను టీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో బీసీ ఓట్లను ఆకర్షించాలన్నది కేసీఆర్ వ్యూహాంగా కనిపిస్తోంది. ఫలితంగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటలకు పడే ఓట్లను చీల్చాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి త్వరలోనే ఎల్.రమణ గులాబీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఇలా

Advertisement

తాజా వార్తలు

Advertisement