Friday, May 3, 2024

ఇంటర్ పాసైన విద్యార్థులు అలర్ట్… డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్!

తెలంగాణలో జులై 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో  అడ్మిషన్స్ మొదలైయ్యాయి.  సోమవారం ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ పాసైన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాల‌కు దోస్త్(డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్) నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

జులై ఒకటి నుండి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్, రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కానుండగా… సెప్టెంబర్ ఒకటి నుండి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. అర్హ‌త క‌లిగిన విద్యార్థులు జులై 1 నుంచి 15వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. విద్యార్థులు జులై 3 నుంచి 16వ తేదీ వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్స్ ఇచ్చుకోవ‌చ్చు. జులై 22న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు వచ్చిన విద్యార్థులు 23వ తేదీ నుంచి జులై 27వ తేదీ వ‌ర‌కు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేష‌న‌ల్, బీకాం హాన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ఉస్మానియా, కాక‌తీయ‌, తెలంగాణ‌, మ‌హాత్మాగాంధీ, పాల‌మూరు, శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.

రెండో విడత రిజిస్ట్రేషన్స్ 400 రూపాయల ఫీజుతో జులై 23 నుండి 27 వరకు.. అలాగే జులై 24 నుండి 28 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్స్ ఉండనున్నాయి. ఆగస్ట్ 4 న సీట్ల కేటాయింపు జరుగనుంది. ఆగస్ట్ 5 నుండి 10 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా… మూడో విడత ఆగస్ట్ 5 నుండి 10 వరకు రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఆగస్ట్ 18 న సీట్ల కేటాయింపు జరుగనుంది. ఆగస్ట్ 18 నుండి 21 వరకు అన్ని విడతల్లో సీట్లు పొందిన విద్యార్ధులు ఆయా కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెప్టెంబర్ ఒకటి నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు దోస్త్ వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేయొచ్చు. లేదా దోస్త్ హెల్ప్‌లైన్ సెంటర్, మీసేవ సెంటర్‌, T App Folio Mobile App ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: ప్రభుత్వ స్కూళ్ల సమీపంలో ఆ షాపులు బంద్!

Advertisement

తాజా వార్తలు

Advertisement