Monday, May 6, 2024

మార్చి 9 చరిత్రాత్మక దినం.. సీఎం ఉద్యోగ ప్రకటనపై కవిత హర్షం

తెలంగాణలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం ప్రకటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. యువతకు అవకాశాలు కల్పించే చిత్తశుద్ధి కేవలం టీఆర్ఎస్‌కే ఉందని ఆమె అన్నారు. డిసెంబర్ 9 తెలంగాణ సాధన దినంగా ఎలా మిగిలిపోతుందో.. అలాగే మార్చి 9 కూడా చరిత్రాత్మకంగా మిగిలిపోతుందని కవిత చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించుకుని 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా తాము చర్యలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర యువత ప్రయోజనాలను పరిరక్షించుకోవడం జరిగింది కాబట్టి ఈ అంశం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తడబడిన సందర్భమే లేదన్నారు.

ఇప్పటికే 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. మరోవైపు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాల కల్పనకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. అటు కేంద్రంలో ప్రధాని మోదీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ భర్తీ చేయలేదని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కోర్టుకు వెళ్లడంతోనే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement