Sunday, April 28, 2024

ధాన్యం విష‌యంలో ఉద్దేశ‌పూర్వ‌కంగానే టీఆర్ఎస్ నేత‌ల ఆరోప‌ణ‌లు : బండి సంజ‌య్

ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో ఉద్దేశ‌పూర్వ‌కంగానే కేంద్ర ప్ర‌భుత్వంపై టీఆర్ఎస్ నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆ పార్టీ రాష్ట్ర‌ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో బీజేపీ నేత‌లు తరుణ్ చుగ్, రాజా సింగ్, త‌దిత‌రులు కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ మాట్లాడుతూ… సిద్ధాంతాల పునాదుల మీద ప‌నిచేసే పార్టీల‌కే మ‌నుగ‌డ ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు. తెలంగాణ‌లో కుటుంబ, అరాచ‌క పాల‌న కొన‌సాగుతోంద‌ని ఆయ‌న అన్నారు. కుటుంబ పాల‌న నుంచి రాష్ట్రానికి విముక్తి క‌లిగించాల‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యం కోసం బీజేపీ పోరాడుతోంద‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలోని బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు త‌మ కార్య‌క‌ర్త‌లు కృషి చేస్తున్నార‌న్నారు. తెలంగాణ‌లో విద్యుత్తు, ఆర్టీసీ టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుతూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం సామాన్యుల‌ను ఇబ్బందులు పెడుతోంద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. అలాగే, ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇస్తామంటూ నిరుద్యోగుల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ఆయ‌న మండిపడ్డారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారమే ల‌క్ష్యంగా తాము పోరాటాన్ని కొన‌సాగిస్తామ‌ని బండి సంజ‌య్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement