Saturday, May 18, 2024

‘సాగరహారం’లో మీరెక్కడున్నరు?.. కేటీఆర్​ ట్వీట్​కు రాజకీయ నేతల కౌంటర్​.. రీట్వీట్లతో రిప్లయ్​!

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) ఇవ్వాల (శుక్రవారం) చేసిన ఓ ట్వీట్​ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఈ ట్వీట్​కు చాలామంది రియాక్ట్​ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం కోసం చేపట్టిన ఉద్యమంలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ‘సాగరహారం’ పేరుతో యావత్​ తెలంగాణ కదిలివచ్చింది. కాగా, ఆ మహా ర్యాలికి ఇవ్వాల్టికి పదేళ్లు నిండాయి.

సాగరహారం పదో వార్షికోత్సవం సందర్భంగా అంటే సెప్టెంబర్ 30, 2012న హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద సుమారు 1.5 లక్షల మంది జనం గుమిగూడిన ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.  “కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఉధృత స్థాయికి తీసుకెళ్లిన రోజు.. లక్షలాది గొంతులు ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేసిన రోజు” అని కేటీఆర్ తెలుగులో పోస్టు చేశారు.

అంతేకాకుండా.. రోజూ పనికిమాలిన విమర్శలు చేసే రేవంత్, బండి సంజయ్, ప్రవీణ్ కుమార్, షర్మిల తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ ఉంది? అని కేటీఆర్ ఆ ట్వీట్​లో​ ప్రశ్నించారు. దీంతో కేటీఆర్ ట్వీట్‌పై మొదట స్పందించారు తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేటీఆర్‌ను ట్విట్టర్ పిట్టా (పక్షి) అని సంబోధిస్తూ.. “మీరు ఆంధ్రా పెద్దల ఫామ్‌హౌస్‌లలో పార్టీలలో మునిగితేలుతున్నప్పుడు, నేను ఉద్యమంలో పాల్గొన్న వారిని కాపాడేపనిలో ఉన్నాను. అని ట్వీట్​ చేశారు.

ఆంధ్రా పోలీసుల నుంచి తెలంగాణ బిడ్డలను కాపాడాను. అమరవీరుల మృతదేహాలను మోసుకెళ్లాను. కానీ, మీరు ఇప్పుడు తెలంగాణ సంపదను మేఘా వంటి ఆంధ్రా వాటాదారులకు అప్పగించారు. అని తన ట్వీట్​లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (కెఎల్‌ఐపి)ని అప్పగించిన ఆంధ్రాకు చెందిన ప్రైవేట్ కంపెనీ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్)ని ప్రవీణ్ కుమార్ ప్రస్తావించారు.

ఇక.. కొద్దిసేపటికే కేటీఆర్‌ ట్వీట్​కు కాంగ్రెస్​ నేత రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. 2012లో అప్పటి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే రేవంత్ అసెంబ్లీ సమావేశాలకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించడంపై ఒక వార్తా కథనాన్ని పోస్ట్ చేస్తూ, “గవర్నర్ సభలో చేసిన ప్రసంగం ప్రజల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను ప్రతిబింబించలేదు” అని వాదించారు.

- Advertisement -

వార్తల క్లిప్పింగ్‌కు క్యాప్షన్ ఇస్తూ రేవంత్ ఇలా రాశారు- “కల్వకుంట్ల పాములు పుట్టలోకి ప్రవేశించాయి. తెలంగాణ ఉద్యమం అందరిదీ. ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన జేఏసీ సహకారంతో సాగర హారం జరిగింది. గతంలో ఉద్యమంపై ఆధారపడినట్లే ఇప్పుడు రాజ్యాధికారంపై ఆధారపడటం అలవాటు చేసుకుంటున్నారని ఆయన ట్వీట్​లో పేర్కొన్నారు. కాగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, వైఎస్ఆర్ తెలంగాణ అధినేత వైఎస్ షర్మిల ఇంకా తమ స్పందనలను వ్యక్తం చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement