Saturday, May 4, 2024

మద్యం తాగిన వ్యక్తితో ప్రయాణిస్తున్నారా?

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సైబరాబాద్ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కొరడా ఝళిపిస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడ్డవారికి జరిమానాలు విధించడమే కాకుండా.. వారిని కోర్టులో హాజరపరుస్తున్నారు.  సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అధికం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం తాగిన  వ్యక్తి వాహనం నడిపితే.. అది తెలిసి కూడా అందులో ప్రయాణించిన వారిపై కేసు నమోదు చేస్తామంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

మద్యం మత్తులో వాహనాలను నడుపుతున్న చాలా మంది యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాదు రోడ్డు ప్రమాదాల్లో ఇతరుల మరణాలకు కారణం అవుతున్నారని పోలీసులు చెబుతున్నారు. సైబరాబాద్ పరిధిలో ఇలాంటి కేసులు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఏటా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ట్రాఫిక్ రూల్స్‌ను కఠినంగా అమలు చేస్తున్నామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.

ఇదిఇలా ఉంటే.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే.. స్పాట్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారలు హెచ్చరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు చాలా మందిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. ఆర్టీఏ అధికారులు లైసెన్స్‌లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. కానీ చాలా మంది పదే పదే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడుతున్నారు. దీంతో మద్యం తాగిన వాహనం నడుపుతున్న వ్యక్తితో ప్రయాణించిన వారిపై కేసు నమోదు చేస్తామంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement