Saturday, May 4, 2024

అమ‌ర్ నాథ్ యాత్ర‌లో విషాదం- 15మంది మృతి-40మందికి గాయాలు

అమ‌ర్ నాథ్ యాత్ర‌లో విషాదం చోటు చేసుకుంది. జమ్మూకశ్మీర్ అమర్నాథ్ ఆలయం వద్ద భారీ వర్షం, కొండల పైనుంచి వస్తున్న వరదల్లో చిక్కుకొని ఇప్పటి వ‌ర‌కు 15 మంది యాత్రికులు మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. దాదాపు 12 వేల మంది యాత్రికులు గుడారాల్లో తలదాచుకున్నారు. భారీగా వచ్చిన వరదకు గుడారాలు, యాత్రికులు కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు పడుతుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండచరియలు విరిగిపడుతుండటంతో అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

బల్తాల్ .. పహల్గామ్ బేస్ క్యాంపుల నుంచి యాత్రను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. మరోవైపు అమర్‌నాథ్ గుహ మందిరంలో శనివారం రెస్క్యూ ఆపరేషన్ తిరిగి ప్రారంభమైంది. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్, బీఎస్ ఎఫ్, సీఆర్ పీఎఫ్, ఆర్మీ, ఐటీబీటీ జవాన్లు, పోలీసు బృందాలతో శనివారం తెల్లవారుజాము నుంచే సహాయ చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సంభవించిన ఆకస్మిక వరదలో 15 మంది మరణించారని, 40 మందికి పైగా గాయపడ్డారని గందర్‌బాల్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఫ్రోజా షా మీడియాకు చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వారిలో ఐదుగురిని కాపాడినట్టు ఆమె తెలిపారు.క్షతగాత్రులు, తప్పిపోయిన వారి కచ్చితమైన సంఖ్యను నిర్ధారించే ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. సహాయక చర్యల కోసం సైన్యం హెలికాప్టర్లను రంగంలోకి దించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement