Saturday, May 4, 2024

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు రాత్రి నుంచే లాక్‌డౌన్

ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. సోమవారం రాత్రి నుంచే లాక్‌డౌన్ అమల్లోకి రానున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 26 ఉదయం వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రకటన చేశారు. అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో రాత్రిపూట కరోనా కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్ తప్పనిసరి అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందో మాత్రమే తాము చెప్తున్నామని, ప్రజలను భయపెట్టడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు.

ఇప్పటికే టెస్టుల సామర్థ్యాన్ని పెంచామని, ఇప్పటికే ఐసోలేషన్ బెడ్‌లు పూర్తిగా నిండిపోయాయని సీఎం తెలిపారు. ఢిల్లీలో కరోనా పరిస్థితి ఘోరంగా ఉందని, రోజుకు 25 వేల మందికి వైరస్ నిర్ధారణ అవుతోందన్నారు. ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ కొరత ఉందన్నారు. కోవిడ్ పరీక్షలు, కేసుల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. ప్రస్తుత కష్టకాలంలో ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలు సమష్టిగా ఉండాలని అన్నారు. అన్ని ప్రైవేట్ కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని, కేవలం ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే పనిచేస్తాయని కేజ్రీవాల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement