Monday, April 29, 2024

సహస్రాబ్ది ఉత్సవాల్లో ఇవ్వాల్టి కార్యక్రమాలు.. నేడు రాజ్ నాథ్ సింగ్ రాక

యజ్ఞాలు, అష్టాక్షరీ మంత్ర పఠనాలు.. చతుర్వేద పారాయణాలతో నిర్విఘ్నంగా, నిరంతరాయంగా, నిరాటంకంగా సమతామూర్తి వెయ్యేళ్ల పండుగ క‌న్నుల పండువ‌లా జరుగుతోంది. 9వ రోజు గురువారం అష్టాక్షరీ మహామంత్ర అనుష్టాన కార్యక్రమం, ఆరాధన భగవత్ సన్నిధానంలో కొనసాగింది. వేద, పురాణాది గ్రంథాల యొక్క పారాయణ ప్రారంభ శ్లోకాలను, మంత్రాలను విన్నవించారు. ఉదయం 7.30 గంటలకు శ్రీ పెరుమాళ్ స్వామికి ప్రాతకాల ఆరాధన నిర్వహించారు. ఉదయం 9 గంటలకు లక్ష్మీనారాయణ మహా యజ్ఞం జరుగనుంది. త్రిదండి చిన‌జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఉదయం 9.30 గంటలకు 108 దివ్య దేశాల్లోని 20 దేవాలయాల్లో ప్రాణప్రతిష్ఠ‌తో పాటు కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ జ‌ర‌గ‌నుంది.

ఉదయం 10 గంటలకు వైయూహిక ఇష్టి.. నారసింహ ఇష్టి వేద పండితులు నిర్వహించనున్నారు. 10.30గంట‌ల‌కు ప్రవచన మండపంలో రామానుజ పూజ, మధ్యాహ్నం 12.30కి పూర్ణాహుతి జరుగనుంది. 2 గంటలకు ప్రవచన మండపంలో ప్రముఖులు ప్రవచనాలు చేయనున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు లక్ష్మీ నారాయణ మహాయజ్ఞం.. రాత్రి 9 గంటలకు పూర్ణాహుతి జరుగనుంది.

ఇక ఈ రోజు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు. మరోవైపు సమతామూర్తి సందర్శనకు కేంద్ర అతిథులు, సామాన్య భక్తుల తాకిడి పెరుగుతోంది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చి సమతామూర్తి కేంద్రాన్ని దర్శించుకుని వెళ్తున్నారు. నిన్న‌ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఆయనతో పాటు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement