Tuesday, May 14, 2024

ఈ టీకాలు ఒమిక్రాన్‌ను నిలువరించలేవ్.. ‘బూస్టర్’ కావాల్సిందే.. జీనోమ్ కన్సార్టియం సూచ‌న‌లు

క‌ర్నాట‌క‌లో ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి రావ‌డంతో బూస్టర్ డోసుల‌పై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత టీకాలు ఒమిక్రాన్ వేరియంట్‌ను నిలువరించలేవని, కానీ.. రిస్క్ మాత్రం తగ్గిస్తాయని జీనోమ్ కన్సార్టియం వెల్లడించింది. అందుకోసమే బూస్టర్ డోసు అందించాలని కేంద్రానికి సూచించింది. అది కూడా తొలుత 40 ఏళ్లు పైబడినవారికి.. ఈ వేరియంట్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవారికి వ్యాక్సిన్ అందింవ్వాల‌ని తెలిపింది.

కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ దేశంలోకి ప్రవేశించిన తర్వాత దాని నివారణపై జోరుగా చ‌ర్చ సాగుతున్నది. ప్రస్తుత టీకాలు ఒమిక్రాన్ వేరియంట్‌ను నిలువరించగలవా? బూస్టర్ డోసు ఇవ్వక తప్పదా? వంటి చర్చలు జ‌రుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిల్లలకు టీకా పంపిణీ చేపట్టే కార్యక్రమంతోపాటు బూస్టర్ డోసు, అదనపు డోసులు అందించడంపై వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలకమైన పరిశోధన సంస్థ జీనోమ్ కన్సార్టియం ముఖ్యమైన సూచనలు చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల ద్వారా స్వల్ప స్థాయిలోనే యాంటీబాడీలు వస్తున్నాయని, వాటితో ఒమిక్రాన్ వేరియంట్‌ను నిలువరించడం కష్టమేనని తెలిపింది. కాబట్టి, బూస్టర్ డోసు అందించాని సూచనలు చేసింది. అంతేకాదు, ఎవరికీ బూస్టర్ డోసు ఇవ్వాలనే విషయంపైనా వివరణలు ఇచ్చింది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి, కొత్త సవాళ్లు వంటి విషయాలను ఇండియన్ సార్స్ కోవ్2 జీనోమిక్స్ కన్సార్టియం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. వైరస్ వ్యాప్తితోపాటు దాని పరిణామం, మార్పులను పరిశీలించి దాన్ని ఎదుర్కోవడానికి తగిన సూచనలు, సలహాలను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలోకి ఎంటర్ అయిన నేపథ్యంలో తాజాగా కీలక సూచనలు చేసింది. ముందు ఇప్పటికే టీకా తీసుకోకుండా హైరిస్క్‌లో ఉన్నవారికి టీకా వేయాలని తెలిపింది. అలాగే, 40ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసు అందించాలని సూచించింది. అంతేకాదు, ఈ వేరియంట్ బారిన పడే అవకాశాలు ఎక్కుగా ఉండేవారికి బూస్టర్ డోసు వేయాలని పేర్కొంది.

కాగా, వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో జీనోమిక్ సర్వెలెన్స్ కీలకమని ఇన్సాకాగ్ వెల్లడించింది. అవసరమైన ఆరోగ్య పరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ వైరస్ ఎక్కువగా ఉన్న చోట్ల నుంచి రాకపోకలు జరిపిన వారిని పర్యవేక్షించాలని, కరోనా కేసులతోపాటు వైరస్ బారిన పడిన వారి కాంటాక్టులను వేగంగా ట్రేస్ చేయాలని వివరించింది. వీటికితోడు టెస్టుల సంఖ్యను పెంచడంతోపాటు పాజిటివ్ అని తేలిన వారికి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం తప్పకుండా పంపాలని పేర్కొంది.

ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాలు కొన్ని ఏజ్ గ్రూప్‌లకు బూస్టర్ డోసు అందించాలనే నిర్ణయాలు తీసుకున్నాయి. అమెరికాకు చెందిన అంటురోగాల నిపుణుడు డాక్టర్ అంథోని ఫౌచీ కూడా బూస్టర్ డోసుపై సానుకూలంగా మాట్లాడారు. అర్హులైన వయోజనులు బూస్టర్ డోసు తీసుకుని మరింత భద్రతను పొందాలని సూచనలు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement