Sunday, May 5, 2024

TS | ఆరోగ్యశాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక జాబితా.. 5 నెలల్లోనే భర్తీ ప్రక్రియ పూర్తి

వైద్యారోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) ఇవ్వాల (సోమవారం) విడుదల చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని 34 స్పెషాలిటీ విభాగాల్లో వీరు ఎంపికయ్యారు. కొత్తగా ప్రారంభమైన మెడికల్ కాలేజీల్లో మెరిట్ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి, కొత్తగా ప్రారంభమైన మెడికల్ కాలేజీల్లో అభ్యర్థులు కోరుకున్న చోట నియామక ఉత్వర్వులను పొందనున్నారు. భర్తీ ప్రక్రియను కేవలం 5 నెలల రికార్డు సమయంలోనే విజయవంతంగా పూర్తి చేసిన బోర్డును మంత్రి హరీశ్ రావు అభినందించారు. పూర్తి పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించి, ఎప్పటికప్పుడు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తూ, ఎలాంటి సమస్యలు రాకుండా, అర్హులు ఉద్యోగ అవకాశాలు పొందేలా చేయడం గొప్ప విషయం అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంపికైన వైద్యులకు మంత్రి హరీశ్​ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు పెరిగి, సూపర్ స్పెషాలిటీ సేవలు మారుమూల ప్రాంతానికి సైతం చేరువ అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో అవసరమైన వైద్య సిబ్బంది భర్తీని ప్రభుత్వం ప్రారంభించి, విజయవంతంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు వైద్యుల భర్తీతో పాటు, మరోవైపు 5204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీని మొదలు పెట్టినట్లు చెప్పారు. అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా స్టాఫ్ నర్సు నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆన్లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

తాజాగా ఎంపికైన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంతో కొత్తగా ఏర్పడ్డ మెడికల్ కాలేజీల్లోని, ఆయా విభాగాల్లో అందించే వైద్య సేవలు మరింత మెరుగుకానున్నాయి. రెండు వారాల్లోగా కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసి, నియామక ఉత్వర్వులు అందించి, విధుల్లో చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖలో భాగస్వామ్యం అవుతున్న వైద్య సిబ్బంది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి, ఆరోగ్య తెలంగాణను సాకారం చేసేందుకు అంకితభావంతో, సేవాభావంతో కృషి చేయాలని, మంచి వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని మంత్రి ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement